English | Telugu
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని!
Updated : Mar 5, 2025
అక్కినేని వారసుడు అఖిల్ ఒక భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. 2015 లో హీరోగా పరిచయమైన అఖిల్, ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేయగా.. అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మినహా అన్నీ పరాజయం పాలయ్యాయి. చివరగా 2023 లో 'ఏజెంట్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. 'ఏజెంట్' విడుదలై రెండేళ్లు కావొస్తున్నా ఇంతవరకు అఖిల్ తన కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడితో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'ధీర' అనే భారీ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. అలాగే 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కూడా ఒక సినిమా కమిట్ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా పూరి జగన్నాథ్ పేరు తెరపైకి వచ్చింది. (Akhil Akkineni)
ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్. అప్పట్లో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. అలాంటి పూరి.. కొన్నేళ్లుగా వెనుకబడిపోయాడు. ముఖ్యంగా ఆయన గత రెండు చిత్రాలు 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' దారుణంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో పూరి తదుపరి సినిమా ఏంటనే ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తో 'గోలీమార్ సీక్వెల్' చేసే అవకాశముంది అంటూ వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఊహించని విధంగా అఖిల్ తో చేతులు కలపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Puri Jagannadh)
పూరి, అఖిల్ మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయని తెలుస్తోంది. పూరితో సినిమా చేయడానికి అఖిల్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. నిజంగానే ఈ ప్రాజెక్ట్ లాక్ అయితే మాత్రం.. ఈ విజయం ఇద్దరికీ కీలకం అని చెప్పవచ్చు. పూరి ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ హీరోలను ప్రజెంట్ చేయడం ఆయనది భిన్న శైలి. పైగా ఇప్పుడు కసితో సినిమా చేసే ఛాన్స్ వుంది. మరి పూరి ఈ సినిమాతో తాను కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా, అఖిల్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ విజయాన్ని కూడా అందిస్తాడేమో చూడాలి.