English | Telugu
క్రేజీ కాంబో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చియాన్ విక్రమ్!
Updated : Oct 30, 2023
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి మంచి పేరుంది. 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'ధృవ' వంటి హిట్ సినిమాలు ఆయన డైరెక్షన్ లో వచ్చాయి. అయితే ఈమధ్య ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా లేదు. 'సైరా నరసింహారెడ్డి' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇక గత చిత్రం 'ఏజెంట్' అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సురేందర్ రెడ్డి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ అది మొదలు కావడానికి సమయం పట్టే అవకాశముంది. ఈలోపు వెంకటేష్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందని ఇటీవల న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి లిస్టులో మరో హీరో వచ్చి చేరాడు.
తమిళ హీరో విక్రమ్ కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయనతో సురేందర్ రెడ్డి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల విక్రమ్ ని కలిసి కథ చెప్పగా, ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. విక్రమ్ నటనను ప్రాధాన్యమున్న సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. అలాంటి విక్రమ్ తో స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి ఎలాంటి సినిమా తీస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. మరి సురేందర్ రెడ్డి.. వెంకటేష్ సినిమా పూర్తయ్యాక విక్రమ్ ప్రాజెక్ట్ మొదలు పెడతాడా లేక ఇదే ముందు స్టార్ట్ చేస్తాడో చూడాలి.