English | Telugu

మూడు భాగాలుగా 'SSMB 29'.. వచ్చే పదేళ్ళు రాజమౌళితోనే మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మహేష్.. ఈ ఏడాది ఆ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ 'SSMB 29'కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

రాజమౌళి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన 'బాహుబలి' రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ఒకే భాగంగా రాగా, ఇప్పుడు చేయబోయే 'ఎస్ఎస్ఎంబి 29'ని మాత్రం ఏకంగా మూడు భాగాలుగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ మార్కెట్ సృష్టించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' పాట ఆస్కార్ గెలుచుకోవడం ఆయన బ్రాండ్ ని మరింత పెంచింది. ఇక ఇప్పుడు 'SSMB 29'తో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించాలని చూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న 'SSMB 29'ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారట. అదే నిజమైతే కనీసం పదేళ్ల పాటు రాజమౌళి, మహేష్ ఇదే ప్రాజెక్ట్ కి అంకితమైపోతారు. మహేష్ ఫ్యాన్స్ లో పదేళ్ల పాటు తమ హీరో నుంచి ఇతర సినిమాలు రావనే బాధ కన్నా.. తమ హీరో గ్లోబల్ స్టార్ గా మారతాడనే ఆనందమే ఎక్కువ ఉంటుంది అనడంలో సందేహం లేదు.