English | Telugu
బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాతో శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ?
Updated : Sep 17, 2024
అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగిన శ్రీలీల మొదట కన్నడ సినిమాల్లో నటించి ఆ తర్వాత టాలీవుడ్‌కి వచ్చింది అనుకుంటారు. కానీ, శ్రీలీల మొదట తెలుగు సినిమాలోనే నటించింది. అంజలి ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన ‘చిత్రాంగద’ చిత్రంలో తొలిసారి మేకప్ వేసుకుంది. ఈ సినిమాలో శాలినిదేవి చిన్నప్పటి క్యారెక్టర్ పోషించింది. ఆ తర్వాత కన్నడలో రెండు సినిమాలు చేశాక ‘పెళ్లిసందడి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న శ్రీలీల చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్‌సింగ్, రామ్‌చరణ్ సినిమా ఆ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే మహేష్, రవితేజ, రామ్ వంటి హీరోల సరసన నటించిన శ్రీలీల ఇప్పటివరకు తెలుగు, కన్నడ సినిమాల్లో మాత్రమే నటించారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సరసన నటించే ఛాన్స్ శ్రీలీల దక్కించుకుందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అజిత్ ప్రస్తుతం ప్యారలల్‌గా రెండు సినిమాలు చేస్తున్నారు. విడాముయర్చి, గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమాల షూటింగ్‌లతో అజిత్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అజిత్ సరసన శ్రీలీల నటించబోతోంది అనే వార్త తమిళ మీడియాలో వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాతో శ్రీలీల కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏ నిర్మాణ సంస్థగానీ, ఏ డైరెక్టర్‌గానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. ఫైనల్‌గా ఈ ఆఫర్ గురించి శ్రీలీల మాత్రమే చెప్పగలదు కాబట్టి ఆమె ఎనౌన్స్‌మెంట్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారని తమిళ తంబీలు పోస్టులు పెడుతున్నారు. ఆమధ్య తెలుగులో నెలకో సినిమా చొప్పున శ్రీలీల నటించిన కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో గుంటూరు కారం మాత్రమే భారీ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు తమిళ్‌లో అజిత్‌తో సినిమా చేస్తే కోలీవుడ్‌లో అదే భారీ సినిమా అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.