English | Telugu
బాలకృష్ణ ప్లేస్‌ను కబ్జా చేయబోతున్న గోపీచంద్?
Updated : Sep 10, 2024
సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్స్‌తో కొందరు హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు పూరితో సినిమాలు చెయ్యాలని హీరోలంతా ఎంతో వెయిట్ చేసేవారు. అయితే అతను కొన్ని డిజాస్టర్స్, ఫ్లాప్స్ చేయడంతో కాస్త వెనుకపడ్డారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్స్ పూరి కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అతనికి ఖచ్చితంగా ఓ బ్లాక్‌బస్టర్ వస్తేనే తప్ప మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం లేదు. గతంలో నందమూరి బాలకృష్ణతో పైసావసూల్ చిత్రం చేసిన విషయం తెలిసిందే. బాలయ్యకు ఒక డిఫరెంట్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన సినిమా అది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతనితోనే మరో సినిమా ఉంటుందని పూరి అప్పట్లో ఎనౌన్స్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత బాలయ్యతోనే పూరి సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడా ప్రాజెక్ట్ లేదని తెలుస్తోంది. అతని స్థానంలో ఇప్పుడు గోపీచంద్ పేరు వినిపిస్తోంది.
గతంలో గోపీచంద్‌తో గోలీమార్ అనే హిట్ చిత్రాన్ని చేశారు పూరి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే మరో సినిమాకి ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూరి సైడ్ నుంచి గానీ, గోపీచంద్ వైపు నుంచి గానీ ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ప్రస్తుతం గోపీచంద్ విశ్వం సినిమాలో నటిస్తున్నారు. శ్రీను వైట్ల కాంబినేషన్‌లో గోపీచంద్ చేస్తున్న మొదటి సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయా స్టూడియో పతాకాలపై టిజి విశ్వప్రసాద్, వేణు దోనెపూడి విశ్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కాబోతోంది.