English | Telugu

ప‌వ‌న్‌కి పోటీగా కుర్ర‌హీరో

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా వ‌స్తోందంటే... బాక్సాఫీసు ఎలెర్ట్ అయిపోతుంది. ప‌వ‌న్ సినిమా ద‌రిదాపుల్లో మ‌రో సినిమా క‌నిపించ‌దు. చిన్న సినిమాలు అయితే ముందే సైడ్ అయిపోతాయి. గ‌బ్బ‌ర్ సింగ్, అత్తారింటికి దారేది.. సినిమాల‌తో వ‌వ‌న్ సినిమాల‌తో పోటీ ప‌డ‌కూడ‌ద‌న్న సంగ‌తి క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. అయితే ప‌వ‌న్ స్టామినా తెలిసి తెలిసి ఓ కుర్ర హీరో ప‌వ‌న్‌కి పోటీగా రంగంలోకి దిగుతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్, వెంక‌టేష్‌ ప్ర‌ధాన పాత్రలు పోషించిన చిత్రం గోపాల గోపాల‌. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ సంక్రాంతికి విడుద‌ల అవుతుంది. జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నెల రోజుల క్రిత‌మే నిర్ణ‌యానికి వ‌చ్చింది. ప‌వ‌న్‌తో పోటీ చేసే ధైర్యం లేక చాలా చిన్న సినిమాలు, ఓ మాదిరి చిత్రాలూ సైడ్ అయిపోయాయి. అయితే.. శ‌ర్వానంద్ మాత్రం నేనున్నా.. అంటూ పోటీకి వ‌స్తున్నాడు. శ‌ర్వానంద్, నిత్య‌మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు. క్రాంతిమాద‌వ్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. పాట‌లూ వ‌చ్చాయి. ఇప్పుడు విడుద‌ల తేదీ ఫిక్స‌య్యింది. గోపాల గోపాల విడుద‌ల రోజునే.. ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని నిర్మాత కె.ఎస్‌.రామారావు డిసైడ్ అయ్యారు. ''పెద్ద సినిమా గోపాల గోపాల విడుద‌ల రోజునే మా సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాం. గోపాల గోపాల బాగా ఆడాలి. దానితో పాటు మా సినిమా కూడా మంచి విజ‌యం సాధించాలి'' అని ఆయ‌న ఆకాంక్షించారు. పోయి పోయి ప‌వ‌న్ సినిమాతో పెట్టుకొంటున్నారు. ఏమ‌వుతుందో, ఏంటో..?