English | Telugu
'దేవర' ఐటెం సాంగ్ లో సమంత.. ఈసారి కాస్త డోస్ ఎక్కువే!
Updated : Sep 11, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
అప్పట్లో 'జనతా గ్యారేజ్'లోని ఐటెం సాంగ్ 'పక్కా లోకల్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఎన్టీఆర్ తో కలిసి కాజల్ అగర్వాల్ చిందేసిన ఈ పాట థియేటర్స్ లో విజిల్స్ పడేలా చేసింది. ఇప్పుడు 'దేవర'లో అంతకుమించిన కిక్ ఇచ్చే ఐటెం సాంగ్ ని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం సమంతను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా' అంటూ సమంత చేసిన సందడి అంతాఇంతా కాదు. తన సినీ కెరీర్ లో మొదటిసారి చేసిన స్పెషల్ సాంగ్ తోనే పాన్ ఇండియా రేంజ్ లో ఒక ఊపు ఊపింది. అందుకే సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి గుర్తింపు ఉన్న సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకోవాలని దేవర టీం భావిస్తోందట. పైగా ఎన్టీఆర్-కొరటాల కాంబోకి సమంత సెంటిమెంట్ కూడా. 'జనతా గ్యారేజ్'లో సమంతనే హీరోయిన్. అప్పుడు ఆమె నటిస్తే బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు చిందేస్తే కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.