English | Telugu
డబుల్ ధమాకాకి రెడీ అవుతున్న రవితేజ, శ్రీలీల?
Updated : May 27, 2024
రవితేజ హీరోగా ఈమధ్య కొన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ని పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చేసిన కొన్ని సినిమాలు ఆయనకు బాగా ప్లస్ అయ్యాయి. అందులో త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో చేసిన ‘ధమాకా’ ఒకటి. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో హీరోయిన్ శ్రీలీల ఎఫర్ట్ కూడా ఉంది. ఆ సినిమా రవితేజకు, శ్రీలీలకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు శ్రీలీల హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉంది. రవితేజ కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు.
‘ధమాకా’ తర్వాత శ్రీలీల ఐదు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా తర్వాత రవితేజ చేసిన సినిమాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. రవితేజ 75వ సినిమా భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరోసారి రవితేజ సరసన శ్రీలీల నటించనుందనే వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.