English | Telugu

ఈయన చెప్పిన దొంగ పవనేనా ?

 

దర్శకురాలు జీవిత రాజశేఖర్ ఇటీవలే బిజేపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ మాత్రం పార్టీలో చేరకుండా తన మద్దతును తెలిపారు. మోడీ ప్రధాని అవ్వాలని ఇటీవలే మోడీపై ఓ పాటను కూడా రూపొందించారు. ఇటీవలే మోడీని ఈ దంపతులు కలిసి ఆ పాటను చూపించారు. అయితే ఈ విషయం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ..."మోడీనే ప్రధాని అని ఇప్పటికే జనాలు అనుకుంటున్నారు. త్వరలోనే మోడీ ప్రధాని అవుతారు. కానీ బిజేపిలోకి అన్ని పార్టీలకు చెందినవాళ్ళు చేరారు. అందులో మంచివాళ్ళున్నారు, దొంగలున్నారు. అందుకే మోడీని కలిసి 'పార్టీలో దొంగల్ని ఎదగనీయకుండా చూడండి' అనే కోరబోతున్నా" అని అన్నారు. అలాగే 'పవన్ కళ్యాణ్, కేసీఆర్ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడటం మంచిది కాదు" అని అన్నారు.

అయితే రాజశేఖర్ పైన మాట్లాడిన మాటల్లో పార్టీలోకి చేరిన దొంగలు అని పవన్ ను ఉద్దేశించి అన్నాడా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బిజేపికి మద్ధతు తెలిపిన క్షణం నుండి పవన్ కు ఉన్న పాపులారిటీ దేశవ్యాప్తంగా మరింత రెట్టింపు అయ్యింది. అయితే గతంలో పవన్ కుటుంబానికి రాజశేఖర్ కుటుంబానికి మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అందుకే రాజశేఖర్ ఇపుడు ఇలా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పవన్ రాజకీయపరంగా ఎదిగిపోతే తనకు ఎలాంటి లాభం లేదనే భావనతో రాజశేఖర్ ఇలా మాట్లాడుతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఏదేమైనా కూడా రాజశేఖర్ చెప్పే మాటలు మోడీ ఎంతవరకు పాటిస్తాడో చూడాలి.