English | Telugu
'పుష్ప-2'కి వెయ్యి కోట్ల ఆఫర్!
Updated : Sep 4, 2023
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న పుష్ప రెండో భాగం 'పుష్ప: ది రూల్'పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా 'పుష్ప-2'కి కళ్లుచెదిరే ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. నార్త్ లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సెలబ్రిటీలు సైతం పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఫిదా అయ్యారు. ఇప్పుడు 'పుష్ప-2'పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. 'పుష్ప-2' ఫస్ట్ లుక్ కి, గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దానికితోడు పుష్ప-1 కి గానూ బెస్ట్ యాక్టర్ గా బన్నీ నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో పుష్పరాజ్ పేరు మారుమోగిపోతోంది. దీంతో పుష్ప-2 రేంజ్ పెరగడంతో పాటు అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే తాజాగా వెయ్యి కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి ఏకంగా వెయ్యి కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి ఈ ఆఫర్ కి మేకర్స్ ఓకే చెప్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతకు మించిన సంచలనాలు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి.