English | Telugu

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తేజ సజ్జా!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అంటే ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక బ్రాండ్. హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది దర్శకులలో ఆయన ఒకరు. అప్పట్లో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. ఎందుకంటే ఆయన హీరోలను ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. పూరి సినిమాల్లోని హీరోల ఆటిట్యూడ్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేసేవి. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా పూరి డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలు అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొంతకాలంగా పూరి ట్రాక్ రికార్డు బాలేదు. పైగా స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాల జపం చేస్తూ, అసలు పూరి వైపు చూడటమే మానేశారు. ఓ వైపు వైపు పరాజయాలు, మరోవైపు స్టార్ హీరోలు అందుబాటులో లేకపోవడంతో కుర్ర హీరోలపై పూరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జా (Teja Sajja)తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పూరి దర్శకత్వంలో ఆయన మార్క్ సినిమా వచ్చి దాదాపు పదేళ్లవుతుంది. 2015 లో వచ్చిన 'టెంపర్' తర్వాత ఆయన మార్క్ సినిమా రాలేదు. 2019 లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' కమర్షియల్ గా మంచి హిట్ అయినప్పటికీ.. పూరి మార్క్ సినిమా కాదనే అభిప్రాయం ఆయన అభిమానవుల్లో ఉంది. ఇక ఆ తర్వాత వచ్చిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కనీసం యంగ్ హీరోలైనా పూరితో ఇప్పుడు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తేజ సజ్జా మాత్రం ప్రజెంట్ పూరి ట్రాక్ ని పట్టించుకోకుండా ఆయనతో సినిమా చేయడానికి సై అంటున్నాడని సమాచారం.

'హనుమాన్'తో సంచలన విజయాన్ని అందుకొని, పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమేనని డైరెక్షన్ లో 'మిరాయ్' సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత తేజ.. పూరితో చేతులు కలపబోతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయని, పూరి చెప్పిన స్టోరీకి తేజ ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తేజ-పూరి కాంబినేషన్ లో మూవీ ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.