English | Telugu

ఈ చోద్యం చూశారా.. స్టార్‌ కిడ్‌కి అలాంటి దుస్థితి వచ్చింది?

సినిమా లవర్స్‌ మెల్ల మెల్లగా థియేటర్స్‌ను మర్చిపోతున్నారు. దానికి నిదర్శనంగా ఓటీటీలోని సినిమాలకు గిరాకీ బాగా పెరిగింది. థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలు ఎక్కువగా చూస్తున్నారనేది వాస్తవం. కొన్ని సినిమాలకు థియేటర్లలో వచ్చే కలెక్షన్స్‌ కంటే ఓటీటీ సంస్థలు ఇచ్చే మొత్తం చాలా ఎక్కువగా కనిపిస్తుండడంతో నిర్మాతలు వారి చెప్పు చేతల్లో ఉంటున్నారని ఇండస్ట్రీలోని ఒక వర్గం గుసగుసలాడుతోంది. కొన్ని సినిమాల రిలీజ్‌ డేట్స్‌ని కూడా ఓటీటీ సంస్థలే ఫిక్స్‌ చేస్తున్నాయనేది మరో కొత్త విషయం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు మూతపడ్డాయి. మరికొన్ని రన్‌ చెయ్యాలా, మూసెయ్యాలా అంటూ ఊగిసలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్టార్‌ హీరో తనయుడితో సినిమా చెయ్యబోతున్న ఓ భారీ నిర్మాణ సంస్థ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో ఎంత నిజం ఉంది అనేది త్వరలోనే తెలుస్తుంది. 

ఆ హీరోకి ఇప్పటివరకు ఒక్క సక్సెస్‌ కూడా లేదు. అతను చేసిన గత చిత్రం భారీ డిజాస్టర్‌ అయింది. ఆ సినిమా చూస్తున్నంత సేపు థియేటర్‌లో ప్రేక్షకులు హాహాకారాలు చేశారు. అలా.. ఓ ఆణిముత్యంలాంటి సినిమా చేసిన హీరోతో మరో సినిమా చేసేందుకు సిద్ధమైన ఆ సంస్థ అతనితో మేకోవర్‌ చేయిస్తోంది. అయితే అది షూటింగ్‌ కోసం కాదట. ఓటీటీ సంస్థతో డీల్‌ కుదుర్చుకోవడానికట. ఇది అందరికీ విడ్డూరంగా అనిపించినా నిజం అంటున్నారు ఈ విషయం గురించి తెలిసినవారు. ఆ హీరోతో సినిమా అంటే ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే సినిమా సెట్స్‌పైకి రాకముందే నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌పై కన్నేశారు నిర్మాతలు. ఒక ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు హీరోకి ముందే మేకోవర్‌ చేయించి, ఫోటో షూట్‌ చేశారు. ఆ ఫోటోలకు తమ దగ్గర ఉన్న కంటెంట్‌ని కూడా జతచేసి ఆ సంస్థకు పంపారు. ఆ ఓటీటీ సంస్థతో తమ డీల్‌ ఓకే అవుతుందా లేదా అని నిర్మాతలతోపాటు హీరో కూడా టెన్షన్‌ పడుతున్నాడట. ఆ హీరో ఎవరు, ఆ నిర్మాత ఎవరు.. ఏ సినిమా కోసం హీరోని మేకోవర్‌ చేశారు అనేది త్వరలోనే తెలుస్తుంది.