English | Telugu

నెగెటివ్‌ షేడ్స్‌తో ‘బ్రహ్మరాక్షస’గా ప్రభాస్‌.. మూడేళ్ళు ఆగక తప్పదా!

పాన్‌ ఇండియా సినిమాలతో ఇండియాలోనే నెంబర్‌వన్‌ హీరో అనిపించుకుంటున్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ ఐదు భారీ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. మారుతి డైరెక్షన్‌లో ది రాజా సాబ్‌, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో స్పిరిట్‌, హను రాఘవపూడితో ఫౌజీ లైన్‌లో ఉన్నాయి. ఇవిగాక సీక్వెల్స్‌ సలార్‌ 2, కల్కి2 ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్‌. హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేస్తున్న ఫౌజీ ఆల్రెడీ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. అయితే ఈ సినిమా సెట్స్‌కి ఇంకా ప్రభాస్‌ వెళ్ళలేదు. రాజా సాబ్‌ పూర్తయిన తర్వాత ప్రభాస్‌కి సంబంధించి పోర్షన్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందట. 

సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో చేయబోతున్న వయొలెంట్‌ మూవీ స్పిరిట్‌ డిసెంబర్‌లోగానీ, జనవరిలో గానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2025 ఎండిరగ్‌ వరకు ఈ మూడు సినిమాలతోనే సరిపోతుంది. సలార్‌2, కల్కి2 పూర్తి చెయ్యాలంటే మరో సంవత్సరం పడుతుంది. అంటే 2026 వరకు కమిట్‌ అయిన సినిమాలతోనే ప్రభాస్‌ చాలా బిజీ. ఈ లెక్కన ఇప్పట్లో ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఫిలింనగర్‌లో  ఓ కొత్త న్యూస్‌ వినిపిస్తోంది. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చెయ్యబోతున్నాడు అనేదే ఆ వార్త. 

బ్రహ్మరాక్షస పేరుతో ప్రశాంత్‌ వర్మ ఓ కథ రాసుకున్నాడు. దాన్ని తెరకెక్కించేందుకు గతంలో కూడా ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఓ బాలీవుడ్‌ హీరోకి ఈ కథ చెప్పాడు. అతను ఓకే.. చేద్దాం అన్నాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు అదే కథను ప్రభాస్‌ ఓకే చేశాడని సమాచారం. ఈ కథలో హీరో క్యారెక్టర్‌ నెగెటివ్‌ షేడ్స్‌తో ఉంటుంది. గతంలో బిల్లా చిత్రంలో నెగెటివ్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఆ తరహాలో ఉండే క్యారెక్టర్‌ చెయ్యాలని ప్రభాస్‌ ఎదురుచూస్తున్నాడట. ప్రశాంత్‌ వర్మ చెప్పిన బ్రహ్మ రాక్షస కథలోని తన క్యారెక్టర్‌ ప్రభాస్‌కి బాగా నచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్‌ తను కమిట్‌ అయిన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో.. ప్రశాంత్‌ వర్మ కూడా తన సినిమాలతో అంతే బిజీగా ఉన్నాడు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. ప్రభాస్‌ కమిట్‌ అయిన సినిమాలన్నీ పూర్తయి ప్రశాంత్‌వర్మ సినిమా ప్రారంభం కావాలంటే కనీసం మూడేళ్ళు పడుతుంది. అంటే బ్రహ్మ రాక్షస సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్‌ రావడానికే అంత టైమ్‌ పడుతుంది. మరి ఈలోగా ఏదైనా మ్యాజిక్‌ జరిగి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.