English | Telugu

'గుంటూరు కారం' కోసం పవన్ కళ్యాణ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం త్రివిక్రమ్.. తన మిత్రుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. కలిసి సినిమాలు చేస్తున్నా, చేయకపోయినా వీరి స్నేహం కొనసాగుతూనే ఉంటుంది. వీరి కలయికలో ఇప్పటిదాకా 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా 'జల్సా'కి మహేష్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఆ సినిమాకి పాటలు, మాటలు ఎంత ప్లస్ అయ్యాయో.. మహేష్ వాయిస్ ఓవర్ కూడా అంతే ప్లస్ అయింది. పవన్ పాత్రని పరిచయం చేస్తూ, కథలోకి తీసుకెళ్లిన విధానం ఆకట్టుకుంది. ఇప్పుడు 'గుంటూరు కారం'కి కూడా అదే శైలిని ఫాలో అవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్ పాత్రను పరిచయం చేస్తూ, కథలోకి తీసుకెళ్లడానికి బలమైన వాయిస్ ఓవర్ కావాలని భావించిన త్రివిక్రమ్.. దీనికి పవన్ వాయిస్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ దగ్గర ప్రస్తావించగా.. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా వాయిస్ ఓవర్ అందిస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. అదే నిజమైతే అటు మహేష్ ఫ్యాన్స్ కి, ఇటు పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పొచ్చు.