English | Telugu
'ఉస్తాద్'ని పక్కన పెట్టనున్న పవన్ కళ్యాణ్!
Updated : Jul 14, 2023
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ కూడా విడుదలై ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేసే ఆలోచనలో పవన్ ఉన్నారట.
పవన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జూలై 28న ఆయన 'బ్రో' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే ఈ ఏడాది చివరిలో 'ఓజీ'తో అలరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేదు. ఇప్పటికే 'బ్రో' షూటింగ్ పూర్తి చేసిన పవన్, వీలైనంత త్వరగా 'ఓజీ' కూడా పూర్తి చేసి.. తన దృష్టినంతా రాజకీయాలపై పెట్టాలనుకుంటున్నారట. అందుకే ప్రస్తుతానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలి అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ చిత్రం వారం పదిరోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. పవన్ ఈ సినిమాకి ఇంకా చాలా డేట్స్ కేటాయించాల్సి ఉంది. కానీ ఆయనకున్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ప్రస్తుతం అది సాధ్యపడదు. అందుకే ప్రస్తుతానికి 'ఉస్తాద్'కి బ్రేక్ పడినట్లే అంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ముగిశాక మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని, ఈలోపు హరీష్ శంకర్ మరో సినిమా చేయనున్నారని వినికిడి. మరోవైపు పవన్ నటిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికల తర్వాతయినా ఈ సినిమా షూటింగ్ లో కదలిక వస్తుందేమో చూడాలి.