English | Telugu
బాబాయ్ కి మైనస్.. మరి అబ్బాయ్ సంగతేంటో!?
Updated : Jul 8, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చరణ్ కి జంటగా కియారా అద్వాని దర్శనమివ్వనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. థియేటర్లలో ఎంటర్టైన్ చేయనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, 'గేమ్ ఛేంజర్' తరువాత రామ్ చరణ్ మరో ఆసక్తికరమైన చిత్రం చేయనున్నాడు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా రూపొందించనున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రారంభం కానుందని బజ్. అంతేకాదు.. ఈ మూవీకి 'డబుల్ ఆస్కార్ అవార్డ్స్' విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు అందిస్తారని గత కొంతకాలంగా వినిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. రెహమాన్ ఈ సినిమాకి పనిచేయడం దాదాపు లాంఛనమేనట. అదే గనుక నిజమైతే.. మెగా కాంపౌండ్ లో ఎ.ఆర్. రెహమాన్ పనిచేసే రెండో చిత్రమిదే అవుతుంది. గతంలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పులి' (2010)కి మ్యూజిక్ అందించారు. మరి.. బాబాయ్ కి అచ్చిరాని రెహమాన్ ట్యూన్స్.. అబ్బాయ్ కైనా కలిసొస్తాయా? వెయిట్ అండ్ సీ!