English | Telugu
ప్రశాంత్ నీల్ విషయంలో ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ తప్పదా?
Updated : Dec 26, 2023
పాన్ ఇండియా హీరోగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. కెజిఎఫ్ సిరీస్‌తో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్... వీరిద్దరూ కలిస్తే ఎలాంటి ప్రభంజనం అవుతుందో ‘సలార్’ నిరూపించింది. సినిమా రిలీజ్‌కి ముందునుంచే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాని భారీగా ప్రమోట్ చెయ్యాలని చిత్ర యూనిట్ ఏ దశలోనూ ప్రయత్నించలేదు. నామమాత్రంగా కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం ఇచ్చారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ చెయ్యడం ఈమధ్యకాలంలో ఆనవాయితీగా మారిపోయింది. సినిమా మీద ఉన్న అపారమైన నమ్మకంతో దాన్ని కూడా పక్కన పెట్టారు మేకర్స్. జనంలో ‘సలార్’పై ఎలాంటి క్రేజ్ ఉందో గ్రహించిన మేకర్స్ డైరెక్ట్‌గా థియేటర్లలోకి సినిమాను తీసుకొచ్చేశారు. ఊహించిన విధంగానే ప్రారంభంలోనే సలార్ దూకుడు అందరికీ అర్థమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ‘సలార్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, కలెక్షన్ల వర్షం కురిపించారు. తొలిరోజే దాదాపు రూ.180 కోట్లు కలెక్ట్ చేసి తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఒక్కసారిగా మూడోస్థానానికి ఎగబాకింది. అంతేకాదు, నాలుగురోజుల్లో దాదాపు రూ.450 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ప్రభాస్, ప్రశాంత్ నీల్ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. అయితే నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలను ‘సలార్’ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ చేయబోయే తదుపరి సినిమా ఏమిటి అనే విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. సలార్ ప్రమోషన్స్‌లోనే తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్31 అనే వర్కింగ్ టైటిల్‌తో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘సలార్’ కలెక్షన్ల సునామీని ప్రత్యక్షంగా చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు ప్రశాంత్ నీల్ తమ హీరోతో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్‌తోపాటు అతని అభిమానులకు నిరాశ తప్పదని తాజా సమాచారం మేరకు తెలుస్తోంది. అదేమింటే.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సినీవర్గాల్లో ఈ మాట బాగా వినిపిస్తోంది.
అసలు విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ చేసింది కెజిఎఫ్ సిరీస్ ఒక్కటే అయినా రెండో ప్రాజెక్ట్‌కే డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు సలార్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో అతనితో ఏ హీరో సినిమా చేసినా అది సూపర్‌హిట్టేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. ‘సలార్’ రిలీజ్ నాలుగు రోజులు అవుతోంది. ఈ నాలుగు రోజుల్లో సినిమాకి వచ్చిన కలెక్షన్స్, హీరోకి, డైరెక్టర్‌కి వస్తున్న అప్రిషియేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చెయ్యాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఇచ్చిన ట్విస్ట్ వల్ల రెండో పార్ట్‌పై ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే రెండో పార్ట్‌గా చెబుతున్న ‘శౌర్యాంగపర్యం’ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తేవాల్సిన అవసరం ఉందంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత ‘వార్2’ షూటింగ్ కోసం బాలీవుడ్ వెళ్ళనున్నాడు ఎన్టీఆర్. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉంటుంది. దీన్ని బట్టి ‘సలార్’ సెకండ్ పార్ట్‌ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారన్న న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. సలార్ సీజ్‌ఫైర్ వేడి చల్లారకముందే శౌర్యాంగ పర్వాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఏ ప్రాజెక్ట్ మొదట స్టార్ట్ చేస్తాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.