English | Telugu

షాకింగ్‌.. 14 ఏళ్ళు ఖాళీగా ఉన్న డైరెక్టర్‌తో నయన్‌ సినిమా.. ఎందుకో మరి!

కమర్షియల్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వైపు దృష్టి సారించింది నయనతార. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అయితే ఈమధ్యకాలంలో వచ్చిన ఆ తరహా సినిమాలు ఆమెకు ప్లస్‌ అవ్వలేదు. కొన్నాళ్ళు అలాంటి సినిమాలను పక్కన పెట్టి కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మంచి కథ, డైరెక్టర్‌ కుదిరితే లేడీ ఓరియంటెడ్‌ మూవీతో మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తవ్వకాల్లో బయటపడిన ఒక డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

తమిళ్‌లో నటుడిగానే కాదు దర్శకుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్న శశికుమార్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. శశికుమార్‌కి తమిళ్‌లో మంచి పేరు వుంది. అయితే ఈమధ్య నటుడిగా కూడా అతనికి ఎక్కువ సినిమాలు లేవు. ఇక డైరెక్టర్‌గా అతను చేసింది రెండు సినిమాలే. అందులో ‘సుబ్రమణ్యపురం’ మాత్రం పెద్ద హిట్‌ అయి దర్శకుడిగా శశికుమార్‌కి మంచి పేరు తెచ్చింది. ఈ తర్వాత రెండేళ్ళకు మరో సినిమా చేసినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో డైరెక్షన్‌ని పక్కన పెట్టి నటుడిగానే కొనసాగుతున్నాడు. అతను మెగా ఫోన్‌ పట్టుకొని 14 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు అతనితో నయన్‌ సినిమా చేయబోతోందని తెలుస్తోంది. అయితే అతన్ని డైరెక్టర్‌గా ఎంపిక చేసుకోవడానికి రీజన్‌ ఏమిటనేది తెలియదు. శశి చెప్పిన కాన్సెప్ట్‌ నయన్‌కు నచ్చిందా? లేక డైరెక్టర్‌ మార్పు కోసం అతన్ని సెలెక్ట్‌ చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్‌గానే కాదు, నటుడుగా కూడా అతను అంత బిజీగా లేడు. గతంలో కమిట్‌ అయిన సినిమాలనే పూర్తి చేస్తున్నాడు తప్ప కొత్త ప్రాజెక్ట్‌ ఒక్కటి కూడా చెయ్యడం లేదు. 

లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌తో మరో బ్లాక్‌బస్టర్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్న నయన్‌తో శశికుమార్‌ ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం నయన్‌ రెండు సినిమాలు చేస్తోంది. ఒక సినిమా పూర్తవగా, మరో సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే అది కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. నయన్‌, శశి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని సమాచారం. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.