English | Telugu

'కల్కి'లో బిగ్ సర్‌ప్రైజ్.. మహేష్ బాబు కూడా భాగమే!

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమా పేరు మారుమోగిపోతోంది. జూన్ 27న విడుదల కానున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని.. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాలా అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఇప్పుడు 'కల్కి'కి సంబంధించిన ఓ న్యూస్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తోంది.

ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కల్కి'లో పలు పౌరాణిక పాత్రలు కనిపించనున్నాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలిగా కమల్ హాసన్ కనిపించనున్నారు. ఇక ప్రభాస్ పాత్రకి సంబంధించి సంచలన న్యూస్ వినిపిస్తోంది. టైటిల్ రోల్ సహా మొత్తం ఆరు పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్కి, భైరవ పాత్రలతో పాటు.. రాముడు, కృష్ణుడు, విష్ణువు, బుద్ధుడు పాత్రల్లో ప్రభాస్ కనువిందు చేయనున్నాడట. ఈ పాత్రల విషయంలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉందట. విష్ణువుగా ప్రభాస్ పాత్రను.. మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తారట. తెలుగునాట మహేష్ వాయిస్ ఓవర్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వంటి హీరోలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు 'కల్కి' లాంటి భారీ సినిమాలో.. ప్రభాస్ కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

'కల్కి'లో ప్రభాస్ ఆరు పాత్రలు, మహేష్ వాయిస్ ఓవర్ తో పాటు.. మరికొన్ని సర్‌ప్రైజ్ లు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అశ్వత్థామతో పాటు మిగతా సప్త చిరంజీవుల పాత్రలు కూడా ఈ సినిమాలో ఉంటాయని.. ఆ పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నీ నిజమైతే.. విడుదల తర్వాత 'కల్కి' సినిమా సృష్టించే సంచలనాలు అంచనాలకు అందవనడంలో సందేహం లేదు.