English | Telugu

మెగా సర్ ప్రైజ్.. చిరు-వినాయక్ కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్!

గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు వీవీ వినాయక్ కొంతకాలంగా రేసులో వెనకబడిపోయారు. ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుంది. చివరిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా ఆయన రూపొందించిన 'ఇంటిలిజెంట్' 2018లో విడుదలై పరాజయం పాలైంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో 'ఛత్రపతి' హిందీ రీమేక్ చేస్తున్నారు కానీ.. విడుదలకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన పేరు ఇప్పుడు పెద్దగా వినిపించట్లేదు. అయితే ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారట.

చిరంజీవికి, వినాయక్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎందరో దర్శకులు క్యూలో ఉన్నా.. తన రీఎంట్రీ మూవీ దర్శకత్వ బాధ్యతలను వినాయక్ కే అప్పగించారంటే.. చిరంజీవికి ఆయనపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా వీరి కాంబినేషన్ లో 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' సినిమాలు రాగా రెండూ విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి కోసం వినాయక్ అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

ఈ సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే ఇదే ఏడాది 'భోళా శంకర్'తోనూ అలరించనున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాపై స్పష్టత లేదు. వెంకీ కుడుములతో చేయాల్సిన సినిమాని మెగాస్టార్ పక్కన పెట్టారని సమాచారం. ఇక ఇప్పుడు ఆ స్థానంలోకి వినాయక్ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. త్వరలో చిరు-వినాయక్ హ్యాట్రిక్ మూవీ ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.