English | Telugu
'డాన్' దర్శకుడితో నాని!
Updated : Jul 11, 2023
ఇటీవల తమిళ దర్శకులతో తెలుగు హీరోలు, తెలుగు దర్శకులతో తమిళ్ హీరోలు సినిమాలు చేయడం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటిది మరో కాంబినేషన్ సెట్ కాబోతుంది. నేచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా కోసం ఓ తమిళ దర్శకుడితో చేతులు కలపబోతున్నాడని తెలుస్తోంది.
'దసరా'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం తన 30వ సినిమాని నూతన దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్నాడు. తండ్రీకూతుళ్ల కథగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'హాయ్ నాన్న', 'హలో డాడీ', 'హలో నాన్న' వంటి టైటిల్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. దీని తర్వాత 'అంటే సుందరానికీ' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా తమిళ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అతను ఎవరో కాదు శివకార్తికేయన్ హీరోగా నటించిన 'డాన్' సినిమా దర్శకుడు సిబి చక్రవర్తి. డాన్ సినిమా తమిళ్ లో ఘన విజయం సాధించడంతో పాటు, తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు సిబి చక్రవర్తి, నానితో తెలుగు, తమిళ్ భాషల్లో ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే నానితో కథా చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. మరి 'డాన్' దర్శకుడితో నాని సినిమా, 'నాని 30' తర్వాత ఉంటుందా లేక వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ తర్వాత ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.