English | Telugu
రేర్ కాంబినేషన్‌లో బాలయ్య కొత్త సినిమా.. మరో బ్లాక్‌బస్టర్‌కి నటసింహం రెడీ?
Updated : Feb 14, 2025
గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్యబాబు టైమ్ అద్భుతంగా నడుస్తోంది. ఎందుకంటే ఏ సినిమా చేసినా బ్లాక్‌బస్టర్ అవుతోంది లేదా సూపర్‌హిట్ అవుతోంది. పరాజయం అనేది బాలయ్య దరి చేరేందుకు భయపడుతున్నట్టుగా ఉంది. అందుకే వరస విజయాలతో దూసుకుపోతున్నారు. 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న బాలయ్య యంగ్ హీరోలకు సైతం ఛాలెంజ్ విసురుతూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఏ డైరెక్టర్‌తో సినిమా చేసినా తప్పకుండా సూపర్‌హిట్ అయిపోతుంది అనే సెంటిమెంట్ బలపడుతోంది. అది నిజమేనన్నట్టు ఇప్పుడు ఓ రేర్ కాంబినేషన్‌లో బాలయ్య సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో త్వరలోనే ఒక సినిమా ప్రారంభం కాబోతోంది.
పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ వంటి మెగా హీరోలతోనే కాదు ఎన్టీఆర్, రవితేజ వంటి మాస్ హీరోలతో సైతం సూపర్‌హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు హరీష్ శంకర్. వరస విజయాలతో దూసుకెళ్తున్న హరీష్‌కి మిస్టర్ బచ్చన్ పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా మారింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌పై పడుతుందేమోనన్న ఆందోళన హరీష్‌లో కలిగింది. ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోగా బాలయ్యబాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. బాలకృష్ణతో సినిమా చేస్తానని హరీష్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయిందనే వార్త బలంగా వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాలయ్యకు హరీష్ చెప్పిన స్టోరీ ఓకే అయిందని తెలుస్తోంది.
యశ్ హీరోగా టాక్సిక్ చిత్రాన్ని నిర్మిస్తున్న కెవిన్ ప్రొడక్షన్స్ సంస్థ బాలయ్య, హరీష్ శంకర్‌ల సినిమాను నిర్మించనుందని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ2 చిత్రం చేస్తున్న బాలయ్య.. అది పూర్తి కాగానే హరీష్ సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో గబ్బర్‌సింగ్, గద్దలకొండ గణేష్, మిస్టర్ బచ్చన్, షూటింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్‌సింగ్.. ఇవన్నీ రీమేక్ సినిమాలే. ఇప్పుడు బాలకృష్ణ కోసం హరీష్ శంకర్ సొంతంగా ఒక కథ రెడీ చేశారట. ఆ కథ బాలయ్యకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ అనిపించుకుంటున్న బాలకృష్ణతో సినిమా చేసి హిట్ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్న హరీష్‌శంకర్‌కి ఇది మంచి అవకాశం కాబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.