English | Telugu
రామ్-బోయపాటి పాన్ ఇండియా మూవీ.. గెస్ట్ రోల్ లో బాలయ్య!
Updated : Nov 2, 2022
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ గత నెలలో షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నాడని తెలుస్తోంది.
ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ రోల్ ఉందట. అది బాలయ్య చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బోయపాటి అడగగా.. బాలయ్య వెంటనే ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కి ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు 'సింహా', 'లెజెండ్', 'అఖండ' బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా సినిమాకి బాలయ్యని మరింత పవర్ ఫుల్ గా చూపిస్తూ వస్తున్నాడు బోయపాటి. ఇప్పుడు స్పెషల్ రోల్ కోసం బోయపాటి, బాలయ్యను సంప్రదించాడంటే ఆ రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం బాలయ్య అభిమానులకు పండగే.
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య.