English | Telugu
20 ఏళ్ళ తర్వాత బాలకృష్ణ కోసం వస్తున్న బాలీవుడ్ భామ.. ఇప్పుడామెను తట్టుకోగలరా?
Updated : Aug 12, 2024
గత ఏడాది ప్రారంభంలో ‘వీరసింహారెడ్డి’, ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో మంచి ఊపు మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ సినిమాపైనే దృష్టి పెట్టారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో చేయబోతున్న ‘అఖండ 2’కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బాబీతో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ‘అఖండ2’ని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటి నుంచీ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే క్యాస్టింగ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా కత్రినా కైఫ్, విలన్‌గా సంజయ్ దత్ నటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో సంజయ్‌దత్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ‘అఖండ2’ చిత్రంలో కూడా సంజయ్ దత్‌ని తీసుకోవాలనే ప్లాన్‌లో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమా చెయ్యడానికి సంజయ్ కూడా సుముఖంగానే ఉన్నారని టాక్.
ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. 2003లో ‘బూమ్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 2004లో ‘మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్‌కి వచ్చింది. ఆ మరుసటి సంవత్సరమే బాలకృష్ణ, జయంత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల్లరి పిడుగు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత వచ్చిన వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోకి వెళ్లిపోయింది. దాంతో మళ్ళీ ఆమెను హీరోయిన్‌గా తీసుకునే ధైర్యం ఏ నిర్మాతా చెయ్యలేదు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత కత్రినా టాలీవుడ్‌కి రాబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలకృష్ణ సినిమాలోనే నటించడం విశేషం. 20 ఏళ్ళ క్రితం వచ్చిన మల్లీశ్వరి సినిమాకే కత్రినాకు దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలియదుగానీ, ఆమెను తట్టుకోవడం మన నిర్మాతల వల్ల అవుతుందా అనేది ప్రశ్న.
‘అఖండ’ సాధించిన ఘనవిజయంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘అఖండ2’పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో, అత్యంతగా భారీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణను పవర్‌ఫుల్‌గా చూపించడంలో ఈమధ్యకాలంలో బోయపాటి శ్రీనులా ఎవరూ సక్సెస్ అవ్వలేదు. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ‘అఖండ2’ చిత్రంలో అంతకుముందు కంటే పవర్‌ఫుల్‌గా బాలకృష్ణను ఎలివేట్ చేసేందుకు బోయపాటి కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లకు సంబంధించి వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసేవరకు ఆగాల్సిందే.