English | Telugu

నిర్మాతలకు దాసరితో విభేదాలు

నిర్మాతలకు దాసరితో విభేదాలున్నాయని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. సినీ పరిశ్రమంతా ఒకటేననీ తమలో విభేదాలు లేవనీ సినీ పరిశ్రమ ఎంత మొత్తుకుని చెపుతున్నా...అది దూరపు కొండలు నునుపు అన్న చందంగా ఉందే తప్ప, అక్కడ నిజానికి అంత ఐకమత్యం లేనే లేదనేది దగ్గర నుండి చూచిన వారి అభిప్రాయం. వివరాల్లోకి వెళితే స్టార్ క్రికెట్ మ్యాచ్ ల దగ్గర నుండీ, ఆ మధ్య జరిగిన వజ్రోత్సవాల నిర్వహణలోనూ, తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ ఆ విభేదాలు దగ్గర నుండి చూసిన వారికి చాలా చక్కగా తెటతెల్లమయ్యాయి.

వివరాల్లోకి వెళితే వజ్రోత్సవాల ఆదాయవ్యయాల వివరాల గురించి విలేఖరులడిగినప్పుడు "ఆ లెక్కలు మేం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు" అని నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా వజ్రోత్సవాల నిర్వాహకుల్లో ఒకరైన కె.యస్.రామారావు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత స్టార్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సినీ పరిశ్రమతో సంబంధంలేని అనామకులు అనేకమంది ఆ మ్యాచ్ నిర్వహణలో పెత్తనం సాగిస్తూ దొరికింది...దొరికినట్లు దోచుకున్నారని అప్పట్లో బలంగా వినపడింది. "మా" అధ్యక్షుడు మాగంటి మురళీ మోహన్ మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఈ చర్యలకు వారు పాల్పడినట్లు అనుకున్నారు.

 

ఈ మధ్య ఫెడరేషన్ స్ట్రైక్ విషయంలోనూ నిర్మాతలకూ ఫెడరేషన్ కూ మధ్య మధ్యవర్తిత్వం వహించి సినీ పెద్దగా దాసరి సమస్యను పరిష్కరిస్తారని అంతా అనుకున్నారు. అనవసరంగా 18 రోజుల పాటు కాలయాపన తప్ప ఫలితం మాత్రమ శూన్యం. ఈ ఫెడరేషన్ సమ్మె కారణంగా నిర్మాతల మండలికీ దాసరికి మధ్య అగాధం మరింత పెరిగినట్లుగా తెలిసింది. దాసరి నుంచి సమదేశం తెచ్చిన ఒక చిన్న నిర్మాత ముందు, ఒక ప్రముఖ యువ నిర్మాత ఆ చిన్న నిర్మాతనూ, అతనితో పాటు దాసరిని నానా దుర్భాషలాడినట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ విభేదాలు తీవ్రరూపం దాలిస్తే అందరూ సినీ పెద్దగా భావించే దాసరి నారాయణరావు మర్యాద రోడ్డున పడే ప్రమాదముందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.