English | Telugu
రామ్ చరణ్ హీరోగా ఖైదీ సీక్వెల్
Updated : Apr 18, 2011
రామ్ చరణ్ హీరోగా "ఖైదీ" చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో మెగాస్టార్ సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పి, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం "ఖైదీ'. ఈ చిత్రానికి ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ "ఖైదీ" చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. ఈ చిత్రానికి చక్రవర్తి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
హాలీవుడ్ లో సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించగా వచ్చిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" చిత్రం ఆధారంగా, ఈ "ఖైదీ" చిత్రాన్ని నిర్మించారు. ఈ "ఖైదీ" చిత్రానికి సీక్వెల్ ని రామ్ చరణ్ తేజ హీరోగా నిర్మించాలని "ఖైదీ" చిత్ర దర్శకుడు ఎ.కోదండరామి రెడ్డి కుమారుడు వైభవ్ సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. వైభవ్ "గొడవ" వంటి సినిమాల్లో హీరోగా నటించినా, అతనికి ఆశించిన స్థాయిలో విజయం రాకపోవటంతో ప్రస్తుతం నిర్మాతగా మారబోతున్నారని సినీ వర్గాలంటున్నాయి.
ఈ రామ్ చరణ్ హీరోగా నటించబోయే "ఖైదీ" సీక్వెల్ చిత్రానికి కూడా పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చేందుకు తమ సంసిద్ధతను తెలియజేశారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇదే జరిగితే ఇక పాత సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ మొదలవుతాయని అనుకోవచ్చు.