English | Telugu

మళ్ళీ కలిసి నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఈ జనరేషన్ లో పర్ఫెక్ట్ మల్టీస్టారర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే మూవీ 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో చరణ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో.. "మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప" అంటూ తారక్, చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది. దీంతో వీరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావడం కష్టమేనని భావించారంతా. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ ప్లాన్ చేసినా.. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించడానికి ఆసక్తి చూపుతారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో అసలు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తో సంబంధం లేకుండానే.. మరోసారి తారక్, చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది.

ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ కి శ్రీకారం చుట్టబోతున్నాడట.  ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రానున్న మొదటి సినిమా ఎన్టీఆర్ ది కాగా, రెండో సినిమా చరణ్ ది అని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా చివరిలో చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తారట. అలాగే చరణ్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కొన్ని సీన్స్ లో అలరిస్తుందట. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రానుందని టాక్. 

ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చే సినిమాల్లో ఎన్టీఆర్, చరణ్ తో పాటు భవిష్యత్ లో ఇతర స్టార్లు కూడా భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, పాన్ ఇండియా వైడ్ గా ఇది బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ గా పేరు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ యూనివర్స్ తో ఎన్టీఆర్, చరణ్.. 'ఆర్ఆర్ఆర్'ని మించిన సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.