English | Telugu
గెస్ట్ రోల్ కి నో చెప్పిన నందమూరి బాలకృష్ణ
Updated : Mar 24, 2011
గెస్ట్ రోల్ కి ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నో చెప్పినట్లు సమాచారం. అదేంటి మొన్నీమధ్యనే కదా మంచు లక్ష్మీ ప్రసన్న తన తమ్ముడు మంచు మనోజ్ కుమార్ హీరోగా నిర్మిస్తున్న "ఊ కొడతారా...ఉలిక్కిపడతారా" చిత్రంలో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటించటానికి అంగీకరించారని వినపడింది. అప్పుడే ఆయన నటించనని నిర్ణయం తీసుకున్నాడా...? అని అనుకోకండి. ఇది ఆ సినిమా గురించి కాదు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్న "దూకుడు" చిత్రం గురించి. "దూకుడు" చిత్రంలో పది నిమిషాలుండే ఒక శక్తివంతమైన మంచి పాత్ర ఉందట.ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తారేమోనని "దూకుడు" చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల వెళ్ళి అడగ్గా, ఆ పాత్ర తీరుతెన్నులు నచ్చక, నందమూరి బాలకృష్ణ నేను ఈ పాత్రలో నటించను అని నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు కదా.