English | Telugu

ప్రభాస్ 'కల్కి'లో మరో పాన్ ఇండియా హీరో!

ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్, నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి పలువురు స్టార్లు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.

'హనుమాన్'(Hanuman) అనే సూపర్ హీరో ఫిల్మ్ తో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత ఎందరో దర్శక నిర్మాతల దృష్టి ఈ కుర్ర హీరోపై పడింది. ప్రస్తుతం తేజ.. 'ఈగల్' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చలు దశలో ఉన్నాయి. అంతేకాదు 'కల్కి 2898 AD'లో కూడా తేజ ఒక పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఆ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. కథకి కీలకమైన పాత్రల్లో అది కూడా ఒకటి అని వినికిడి. దీంతో ఈ మూవీలో తేజ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

'కల్కి 2898 AD' పలు భాగాలుగా రూపొందనుందని టాక్. మొదటి భాగాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.