English | Telugu
శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలేంటో తెలుసా!
Updated : Jul 21, 2023
నటనకు పర్యాయపదంలా నిలిచిన తారల్లో 'నడిగర్ తిలగమ్' శివాజీ గణేశన్ ఒకరు. తమిళంలో తిరుగులేని కథానాయకుడిగా రాణించిన ఈ 'నవరస నాయగన్'.. మన తెలుగు సినిమాల్లోనూ సందడి చేశారు. ఇటు ముఖ్య పాత్రల్లోనూ, అటు అతిథి పాత్రల్లోనూ ఆకట్టుకున్నారు. శివాజీ గణేశన్ నటించిన తెలుగు చిత్రాల వివరాల్లోకి వెళితే..
పరదేశి: ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగులో 'పరదేశి' పేరుతో, తమిళంలో 'పూంగోతై' పేరుతోనూ రూపొందిన ఈ సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావుతో కలిసి నటించారు శివాజీ గణేశన్. ఈ చిత్రానికి ఎల్వీ ప్రసాద్ దర్శకుడు. 1953 సంక్రాంతి కానుకగా జనవరి 14న 'పరదేశి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పెంపుడు కొడుకు: ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే తయారైన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, మహానటి సావిత్రి, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రల్లో అభినయించారు. 1953 నవంబర్ 12న ఈ సినిమా రిలీజైంది.
మనోహర: ఈ సినిమాకి కూడా ఎల్వీ ప్రసాద్ నే దర్శకుడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం.. తమిళ వెర్షన్ లో 1954 మార్చి 3న రిలీజ్ కాగా, 1954 జూన్ 3న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.
బొమ్మల పెళ్ళి: తమిళంలో 'బొమ్మై కళ్యాణమ్', తెలుగులో 'బొమ్మల పెళ్ళి' పేర్లతో ఏకకాలంలో నిర్మితమైన ఈ ద్విభాషా చిత్రంలో.. శివాజీ గణేశన్, జమున ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఆర్. ఎం. కృష్ణస్వామి ఈ సినిమాకి నిర్దేశకుడు. 1958 జనవరి 11న తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా.. అదే సంవత్సరం మే 3న తమిళ వెర్షన్ థియేటర్స్ బాట పట్టింది.
నివురుగప్పిన నిప్పు: సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. కె. బాపయ్య రూపొందించిన ఈ మూవీ 1982 జూన్ 24న జనం ముందు నిలిచింది.
బెజవాడ బెబ్బులి: కృష్ణ, రాధిక జోడీగా నటించిన ఈ చిత్రంలో రవీంద్ర, ఏఎస్పీ రఘుగా ఎంటర్టైన్ చేశారు శివాజీ గణేశన్. 1983 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి విజయ నిర్మల దర్శకత్వం వహించారు.
విశ్వనాథ నాయకుడు: దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో కృష్ణది టైటిల్ రోల్ కాగా.. ఆయన తండ్రి నాగమ నాయకుడిగా శివాజీ దర్శనమిచ్చారు. కృష్ణదేవరాయగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించారు. 1987 ఆగస్టు 14న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెండితెరపైకి వచ్చింది.
అగ్ని పుత్రుడు: తండ్రీకొడుకులు ఏయన్నార్, నాగార్జున కలిసి నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. 1987 ఆగస్టు 27న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించారు.
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బి.ఆర్. పంతులు తెరకెక్కించిన త్రిభాషా చిత్రమిది. టైటిల్ కి తగ్గట్టు ఇందులో పిల్లలు ప్రధాన పాత్రధారులు కాగా.. శివాజీ గణేశన్ ఓ స్పెషల్ రోల్ లో మెరిశారు. 1960 జూలై 1న ఈ చిత్రం రిలీజైంది.
రామదాసు: చిత్తూరు వి. నాగయ్య టైటిల్ రోల్ లో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటరత్న నందమూరి తారక రామారావు శ్రీరాముడిగా కనిపించగా.. శివాజీ గణేశన్ లక్ష్మణుడిగా దర్శనమిచ్చారు. 1964 డిసెంబర్ 23న ఈ బయోగ్రాఫికల్ మూవీ రిలీజైంది.
బంగారు బాబు: ఏయన్నార్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ అతిథి పాత్రలో కనిపించారు. వీబీ రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1973 మార్చి 15న రిలీజైంది.
భక్త తుకారం: ఇందులో టైటిల్ రోల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించగా.. శివాజీ పాత్రలో శివాజీ గణేశన్ దర్శనమిచ్చారు. వి. మధుసూదన రావు రూపొందించిన ఈ మూవీ 1973 జూలై 5న తెరపైకి వచ్చింది.
జీవన తీరాలు: కృష్ణంరాజు, వాణిశ్రీ, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శివాజీ గణేశన్ గెస్ట్ రోల్ చేశారు. జీసీ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1977 ఆగస్టు 12న జనం ముందుకు వచ్చింది.
చాణక్య చంద్రగుప్త: ఎన్టీఆర్ చంద్రగుప్త మౌర్యగా.. ఏయన్నార్ చాణక్యుడిగా టైటిల్ రోల్స్ లో అలరించిన ఈ సినిమాలో అలెగ్జాండర్ గా కాసేపు మెరిశారు శివాజీ గణేశన్. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ మూవీ 1977 ఆగస్టు 25న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది.
(జూలై 21.. శివాజీ గణేశన్ వర్థంతి సందర్భంగా)