English | Telugu
'వైల్డ్ డాగ్'ను తక్కువగా ఊహించాను.. చూశాక గూస్‌బమ్స్ వచ్చాయి!
Updated : Apr 5, 2021
"నాగ్ అంటే సాంగ్స్, కామెడీ, రొమాంటిక్ సీన్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇవేవీ ఉండవు కాబట్టి సినిమా డ్రైగా ఉంటుందనే తక్కువ భావంతోనే నిన్న 'వైల్డ్ డాగ్' చూసిన నాకు ఒక ఎడ్రినల్ రష్ లాగా ఒళ్లు గగుర్పాటు కలిగింది." అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏసీపీ విజయ్‌వర్మగా నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ ఇటీవల విడుదలైంది. ఆ సినిమాని ఆదివారం ప్రత్యేకంగా వీక్షించారు చిరంజీవి. ఆ సినిమా తనకిచ్చిన అనుభవం, అనుభూతులను పంచుకోవడానికి సోమవారం నాగార్జునతో కలిసి మీడియాతో సమావేశమయ్యారు.
"వైల్డ్ డాగ్ చూసిన తర్వాత మనందరం గొప్పగా ఫీలయ్యే గొప్ప సినిమాగా నేను ఫీలవుతున్నాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత నిరంజన్‌రెడ్డి దీని గురించి చెప్తున్నప్పటికీ పెద్ద క్యూరియాసిటీ ఈ సినిమా మీద నాకు లేదు. గోకుల్ చాట్‌లో జరిగిన ఓ వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు కాబట్టి బ్లాండ్‌గా, డ్రైగా ఉంటుందని అనుకున్నాను. అయితే సినిమా చూస్తుంటే ఆద్యంతం ఉత్కంఠభరితంగా అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర కూడా ఆపకుండా ఈ సినిమాని చూశాను. దాన్ని బట్టి ఈ సినిమా చూస్తుంటే నాలోని ఇంట్రెస్ట్ చివరిదాకా ఎలా కొనసాగిందనేది నేను మాటల్లో చెప్పలేను. వెంటనే నాగ్‌కు ఫోన్ చేసి, "ఏం సినిమా ఇది.. ఎందుకు దీన్ని లో ప్రొఫైల్‌లో ఉంచారో అర్థం కావట్లేదు. ఇది చాలా గొప్ప సినిమా." అని చెప్పాను." అని ఆయనన్నారు.
ఎక్కడా ఇంట్రెస్ట్ డాపవకుండా క్రమేణా ఉత్కంఠను పెరుగుతూ పోయి కుర్చీలో మునివేళ్లమీద కూర్చుని సినిమా చూశానంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు, వాస్తవమనీ చిరంజీవి అన్నారు. "నిజం చెప్పాలంటే ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్లు లేరు. ఈ సినిమా చూస్తూ ఆనందిస్తూ, ఆదరిస్తున్న ప్రేక్షకులు మాట్లాడారు. వాళ్లతో పాటు నేను కూడా ఈ సినిమా టీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. వాస్తవానికి చాలా దగ్గరగా, సహజంగా ఈ సినిమాని తీశారు. సర్జికల్ స్ట్రైక్ మీద తీసిన 'యూరి' సినిమాకి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి, అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమాని చూసినప్పుడు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు చెయ్యలేకపోతున్నాం, మనం కమర్షియల్ ట్రాప్‌లోకి పడిపోయామా, కొంచెం పక్కకువెళ్లి సినిమాలు ఎందుకు చెయ్యట్లేదు అనే భావనలో ఉన్న నాకు.. ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు, వెరైటీ సినిమాలు చేసే అభిరుచి ఉన్న గొప్ప ఆర్టిస్ట్ అయిన నాగార్జున ఇలాంటి సినిమా చెయ్యడం అన్నది నేను చాలా గర్వంగా ఫీలయ్యాను." అని ఆయనన్నారు.
తెలుగువాళ్లం కూడా ఇలాంటి సినిమాలు అత్యద్భుతంగా తియ్యగలం అని నిరూపించిన సినిమా 'వైల్డ్ డాగ్' అని చిరంజీవి చెప్పారు. "ఈ సినిమాలోని కొన్ని వార్ సీక్వెన్స్‌లు, గన్ ఫైట్లు, సర్జికల్ స్ట్రైక్ ఎపిసోడ్ లాంటివి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఈ సినిమా చూస్తూ ఓ భారతీయుడిగా ఎమోషన్‌ను ఫీలయ్యాను. టెర్రరిస్ట్ అయిన విలన్ చాలా చులకనగా ఇండియన్ సిస్టమ్ గురించి మాట్లాడితే, విజయ్‌వర్మ క్యారెక్టర్‌లో నాగ్ చెప్పిన డైలాగ్స్ చూసి క్లాప్స్ కొట్టేశాను. ఈ మాటలు చెప్తుంటే కూడా నాకు గూస్‌బమ్స్ వస్తున్నాయి." అని తెలిపారు చిరంజీవి.