English | Telugu
పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'కి పాతికేళ్ళు.. నో డ్యూయెట్స్.. నో ఫిమేల్ సింగర్ వాయిస్
Updated : Jul 24, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభంలో పలు ప్రేమకథా చిత్రాల్లో సందడి చేశారు. వాటితో యువతని ఎంతగానో అలరించారు. అలాగే, వరుస విజయాలతో 'యూత్ ఐకాన్'గా అప్పట్లో గుర్తింపు పొందారు. అలాంటి.. పవన్ స్థాయిని పెంచిన సినిమాగా 'తొలిప్రేమ'(1998)కి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా 'తొలి ప్రేమ' నిలిచిపోయింది. ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ విడుదలై.. ఈ జూలై 24కి పాతికేళ్ళు. ఈ సందర్భంగా ఆ సినిమా తాలూకు జ్ఞాపకాల్లోకి వెళితే..
పవన్ కి ఫస్ట్ స్ట్రయిట్ సబ్జెక్ట్, డెబ్యూ డైరెక్టర్:
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(1996)తో కథానాయకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. ఆపై 'గోకులంలో సీత' (1997), 'సుస్వాగతం' (1998) చిత్రాలతో పలకరించారు. ఇవన్నీ కూడా రీమేక్ మూవీస్ నే. అంతేకాదు.. ఈ మూడు కూడా ఈవీవీ సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని శ్రీనివాసరావు వంటి అనుభవమున్న దర్శకులతో చేసిన సినిమాలే. అయితే, 'తొలిప్రేమ' రూపంలో ఫస్ట్ స్ట్రయిట్ సబ్జెక్ట్ మూవీ చేశారు పవన్. అదేవిధంగా.. ఏ మాత్రం అనుభవం లేని ఎ. కరుణాకరన్ కి దర్శకుడిగా మొదటి అవకాశమిచ్చారు. ప్రేమకథంటే అప్పటివరకు సినీ ప్రేక్షకులకు డ్యూయెట్లు, రొమాన్స్ ఉన్న చిత్రాలే. అయితే, 'తొలిప్రేమ' అందుకు భిన్నంగా సాగడం కొత్త అనుభూతినిచ్చింది. ఇందులో కీలకమైన ఇంట్రవెల్, క్లైమాక్స్ సీన్స్ లో తప్ప ఎక్కడా హీరోయిన్ ని ముట్టుకోడు హీరో. అలాగే, పతాక సన్నివేశాల వరకు కథానాయకుడిది వన్ సైడ్ లవ్ కావడంతో పాటల్లో ఫిమేల్ వాయిస్ లేకుండా డైరెక్టర్ డిజైన్ చేశారు. ఈ అంశం యువతని మాట్లాడుకునేలా చేసింది.
కథాంశం:
బాలు (పవన్ కళ్యాణ్) ఓ మధ్యతరగతి యువకుడు. ఎలాంటి లక్ష్యం లేకుండా.. కుటుంబం, స్నేహితులు, క్రికెట్ అంటూ కాలం గడిపేస్తుంటాడు. అప్పుడప్పుడు తండ్రి చేత తిట్లు తింటుంటాడు. అలాంటి బాలు.. ఓ దీపావళి రోజున చిచ్చుబుడ్డుల వెలుగులో అను (కీర్తి రెడ్డి)ని చూస్తాడు. తొలిచూపులోనే అనుతో ప్రేమలో పడిపోతాడు. అయితే, ఆమెతో నేరుగా మాట్లాడే అవకాశాల్ని ఎప్పటికప్పుడు తృటిలో కోల్పోతుంటాడు. మరోవైపు.. ఓ ప్రమాదంలో ఓ చిన్నారిని కాపాడిన బాలుని చూసి ఇంప్రెస్ అవుతుంది అను. తన హాబీలో భాగంగా బాలు ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నిస్తుంది కానీ కొద్దిలో మిస్ అవుతాడు. ఇలాంటి నేపథ్యంలో.. ఇద్దరూ ఊటీకెళ్ళే దారిలో ఎదురుపడతారు. అక్కడ జరిగిన కారు ప్రమాదంలో.. అనుని కాపాడే క్రమంలో కొండపైనుంచి కిందపడిపోతాడు బాలు. అదృష్టంకొద్ది గాయాలతో బయటపడతాడు. తనను కాపాడిన బాలుకి కృతజ్ఞతలు చెప్పడానికి అతని ఇంటికి వెళుతుంది అను. అలా.. ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. చెల్లెలు ప్రియ (వాసుకి) సలహా మేరకు అనుకి తన ప్రేమను తెలియజేసే మంచి తరుణం కోసం ఎదురుచూస్తుంటాడు బాలు. ఒకవైపు చెల్లికి పెళ్ళై అత్తారింటికి వెళ్ళడం.. మరోవైపు ఉన్నత చదువుల కోసం అను విదేశాలకు సిద్ధమవ్వడంతో బాలు దిగాలు పడిపోతుంటాడు. అనుకి వీడ్కోలు చెప్పడానికి ఎయిర్ పోర్ట్ వస్తాడు బాలు. అతనికి వీడ్కోలు పలికి దూరమవుతున్న సమయంలో.. బాలుతో ప్రేమలో ఉన్నట్లు గ్రహిస్తుంది అను. అలా.. ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. యువతకు లక్ష్యం ఉండాలి అంటూ అను చెప్పిన మాటలనే గుర్తుచేస్తూ బాలు.. ఇద్దరూ లక్ష్యాలు చేరుకున్నాకే తిరిగి కలుద్దాం అంటూ చెప్పుకొస్తాడు. అలా.. బాలు, అను ప్రేమకథ సుఖాంతమవుతుంది. 'యువతరానికి ఓ లక్ష్యం ఉండా'లంటూ కరుణాకరన్ తెరకెక్కించిన 'తొలిప్రేమ'.. కేవలం ప్రేమకథకే పరిమితం కాకుండా అన్నాచెల్లెళ్ళ అనుబంధం, కుటుంబ బంధాలకు పెద్దపీట వేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా రంజింపజేసింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జీవీజీ రాజు నిర్మాణ విలువలు కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.
నటీనటులు:
పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన 'తొలిప్రేమ'లో వాసుకి, నగేశ్, అలీ, వేణుమాధవ్, అచ్యుత్, రవిబాబు, పీజే శర్మ, నర్రా వెంకటేశ్వరరావు, సంగీత, బెంగుళూరు పద్మ, విజయ్, మనీషా ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. దర్శకుడు ఎ. కరుణాకరన్ అతిథి పాత్రలో మెరిశారు.
పాటలు:
దేవా అందించిన పాటలు, నేపథ్య సంగీతం 'తొలిప్రేమ'కి ప్రధాన బలంగా నిలిచాయి. పవన్ సినిమాకి దేవా సంగీతమందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యంతో వచ్చిన "ఈ మనసే" (బాలు), "గగనానికి ఉదయం ఒకటే" (బాలు), "ఏమి సోదరా" (కృష్ణంరాజ్).. భువనచంద్ర పదరచన చేసిన "ఏమైందో ఏమో ఈ వేళ" (బాలు), "రొమాన్స్ రిథమ్స్" (సురేశ్ పీటర్స్, ఉన్నిక్రిష్టన్) యువతరాన్ని ఉర్రూతలూగించాయి. వీటిలో "ఏమైందో ఏమో ఈ వేళ" పాటని పవన్ కి అభిమాని అయిన మరో హీరో నితిన్.. 'గుండెజారి గల్లంతయ్యిందే' కోసం రీమిక్స్ చేయడం విశేషం.
ప్రదర్శన:
21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న 'తొలిప్రేమ'.. రెండు కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమైంది. అలాగే 365 రోజుల లాంగ్ రన్ చూసిన సినిమాల జాబితాలోనూ చేరింది.
అవార్డులు:
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న 'తొలిప్రేమ'.. పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. 1998కి గానూ 'ఉత్తమ ప్రాంతీయ చిత్రం' (తెలుగు)గా 'జాతీయ' పురస్కారాన్ని అందుకున్న 'తొలిప్రేమ'.. .. 'ఉత్తమ చిత్రం', 'ఉత్తమ నూతన దర్శకుడు', 'ఉత్తమ సహాయనటి' (వాసుకి), 'ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత' (కరుణాకరన్), 'ఉత్తమ ఆడియోగ్రాఫర్' (మధుసూదన్), 'ఉత్తమ ఎడిటర్' (మార్తాండ్ కె. వెంకటేశ్) విభాగాల్లో ఆరు 'నంది' అవార్డులను దక్కించుకుంది.
రీమేక్స్:
తెలుగులో ఘనవిజయం సాధించిన 'తొలిప్రేమ'.. హిందీలో 'ముఝే కుచ్ కెహనా హై' (తుషార్ కపూర్, కరీనా కపూర్), కన్నడలో 'ప్రీతిసు తప్పేనిల్ల' (వి. రవిచంద్రన్, రచన) పేర్లతో రీమేక్ అయింది.
రి-రిలీజ్:
'తొలిప్రేమ' పాతికేళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. గత నెల జూన్ లో రి-రిలీజ్ చేశారు. రి-రిలీజ్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది.