English | Telugu

బి. గోపాల్ డైరెక్ట్ చేసిన బాలీవుడ్ సినిమాలేంటో తెలుసా!


 

మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. తెలుగులో భారీ విజయాలు చూసిన గోపాల్.. హిందీలోనూ రెండు సినిమాలు చేశారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ మూవీస్ నే కావడం విశేషం. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..

ఇన్సాఫ్ కి ఆవాజ్: హిందీలో గోపాల్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రమిది. తెలుగులో బి. గోపాల్ ఫస్ట్ డైరెక్టోరియల్ అయిన 'ప్రతిధ్వని' (శారద, అర్జున్, రజిని)కి ఇది రీమేక్. రేఖ, అనిల్ కపూర్, రిచా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1986 నవంబర్ 12న రిలీజైంది. తెలుగు వెర్షన్ లాగే హిందీ వెర్షన్ కూడా విజయం సాధించింది. 'ప్రతిధ్వని' గోపాల్ కి తొలి సినిమా కాగా.. 'ఇన్సాఫ్ కి ఆవాజ్' అతని ఫిల్మోగ్రఫీలో రెండో చిత్రం కావడం విశేషం.

కానూన్ అప్నా అప్నా: బాలీవుడ్ లో బి. గోపాల్ రూపొందించిన రెండవ, చివరి చిత్రమిది. తనే డైరెక్ట్ చేసిన 'కలెక్టర్ గారి అబ్బాయి' (అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, శారద, రజిని)కి హిందీ వెర్షన్ గా 'కానూన్ అప్నా అప్నా' తెరకెక్కింది. దిలీప్ కుమార్, నూతన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ రీమేక్ మూవీ.. 1989 అక్టోబర్ 27న జనం ముందు నిలిచింది.

(జూలై 24.. బి. గోపాల్ పుట్టినరోజు సందర్భంగా)