English | Telugu

మురుగదాస్‌ను ఆడుకుంటున్న సల్మాన్‌ ఖాన్‌.. ఏం జరిగింది?

బాలీవుడ్‌ హీరోలు, నిర్మాతలు సౌత్‌ డైరెక్టర్ల వైపు దృష్టి సారించిన విషయం తెలిసిందే. అట్లీ డైరెక్షన్‌లో షారూక్‌ ఖాన్‌ చేసిన జవాన్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్‌ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అందులోనూ సౌత్‌ నుంచి వస్తున్న సినిమాలన్నీ కంటెంట్‌ పరంగా అద్భుతమైన సక్సెస్‌లు సాధిస్తున్న క్రమంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘సికిందర్‌’ అనే సినిమా చేశాడు. మురుగదాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌ అయింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సల్మాన్‌కి పెద్ద షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా అంత పెద్ద ఫ్లాప్‌ అవ్వడానికి సల్మాన్‌ ఖానే కారణమంటూ మదరాసి ప్రమోషన్స్‌లో కామెంట్‌ చేశాడు మురుగదాస్‌. ‘రాత్రి 9 గంటలకు సెట్‌కి వస్తాడు. 11 గంటలకు షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. డే టైమ్‌లో తియ్యాల్సిన షాట్స్‌ని కూడా రాత్రి తీసేవాళ్లం. దాంతో గ్రాఫిక్స్‌ ఎక్కువగా వాడాల్సి వచ్చింది. అందుకే సినిమా ఫ్లాప్‌ అయింది’ అన్నాడు మురుగదాస్‌.

మురుగదాస్‌ కామెంట్స్‌కి సల్మాన్‌ ఖాన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ‘సికిందర్‌ సినిమా చెయ్యకుండా ఉండాల్సిందని కొందరు అన్నారు. అయితే అది బ్యాడ్‌ సినిమా కాదు. కథ బాగుంది. నేను రాత్రి 9 గంటలకు వెళ్ళడం వల్లే సినిమా ఫ్లాప్‌ అయిందని డైరెక్టర్‌ అంటున్నాడు. కానీ, నా పక్కటెముక విరిగిపోయిన విషయం అతనికి తెలీదు. అయితే ఈమధ్య అతను మరో సినిమా చేశాడు. ఆ సినిమాలో హీరో ఉదయం ఆరు గంటలకే సెట్స్‌కి వచ్చేవాడు. మరి ఆ సినిమా ఎందుకు డిజాస్టర్‌ అయింది? సికందర్‌ మూవీని సాజిద్‌ నాడియాద్‌వాలాతో కలిసి మురుగదాస్‌ చెయ్యాలి. కానీ, సాజిద్‌ తప్పుకున్నాడు. ఆ తర్వాత మురగదాస్‌ కూడా వెళ్ళిపోయి.. మదరాసి అనే మూవీ చేశాడు. అది సికందర్‌ కంటే పెద్ద బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అయింది’ అంటూ వెటకారంగా కామెంట్‌ చేశాడు సల్మాన్‌. మురుగదాస్‌ను టార్గెట్‌ చేస్తూ సల్మాన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.