English | Telugu
తాజ్‌మహల్ వెనుక దాగిన రహస్యాలను చెప్పేందుకు వస్తున్న ‘ది తాజ్ స్టోరీ’!
Updated : Oct 10, 2025
కల్పిత కథల కంటే వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి సినిమాలను చూస్తూ ప్రేక్షకులు చక్కని అనుభూతిని పొందుతారు. కొందరు దర్శకులు ఇలాంటి కథలనే ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు. అలాంటి కొన్ని సినిమాలు ఇటీవల సంచలనాలుగా మారిన విషయం తెలిసిందే. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ది బెంగాల్ ఫైల్స్ వంటి సినిమాలు దేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో చూశాం. అయితే బాలీవుడ్ దర్శకులు ఇలాంటి కథలపైనే మక్కువ చూపిస్తున్నారు. వారి పంథాలో అలాంటి సినిమాలను తెరకెక్కించి వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి ఓ చారిత్రక కట్టడం గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పేందుకు ‘ది తాజ్ స్టోరీ’ పేరుతో సినిమా వస్తోంది.
మనకు తెలిసిన తాజ్ మహల్ కథ వేరు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక వింతగా మన చిన్నతనంలోనే తెలుసుకున్నాం. అయితే ఈ కట్టడం వెనుక నిజాలకు తెరరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన దర్శకుడు తుషార్ అమ్రిష్ గోయల్‌కి వచ్చింది. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2023 నవంబర్‌లో ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమాను ఎనౌన్స్ చేశారు. 2024 జూలై 20న షూటింగ్ ప్రారంభించారు. 45 రోజులపాటు ఉత్తర భారతదేశంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజ్‌మహల్ నిర్మాణం వెనుక ఎలాంటి విశేషాలు ఉన్నాయి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.