English | Telugu
కరోనా ఎఫెక్ట్.. 'లవ్ స్టోరి' తర్వాత 'తలైవి' రిలీజ్ ఆగింది!
Updated : Apr 10, 2021
కరోనా ఎఫెక్ట్ మళ్లీ సినిమాలపై చూపించడం మొదలైంది. థియేటర్లు మళ్లీ మూతపడతాయనో, లేదా 50 శాతం ఆక్యుపెన్సీతోటే థియేటర్లు నడుపుకొనే పరిస్థితి వస్తుందనో సినిమాల విడుదలను నిర్మాతలు పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య, సాయిపల్లవి జోడీ 'లవ్ స్టోరి' విడుదల వాయిదాపడగా, లేటెస్ట్‌గా ప్యాన్ ఇండియా మూవీ 'తలైవి' విడుదల కూడా ఆగిపోయింది.
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేయగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23న విడుదల కావాలి. కానీ హిందీ వెర్షన్ రిలీజ్ కావాలంటే మహారాష్ట్రలో పరిస్థితి ప్రతికూలంగా ఉంది. అక్కడ మహమ్మారి మహోధృతంగా విజృంభిస్తోంది. దాంతో థియేటర్లను మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'తలైవి' ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి, అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని ఆడియెన్స్‌కు నేరుగా రాసిన ఓ బహిరంగ లేఖ ద్వారా నిర్మాతలు ప్రకటించారు.
"ఏప్రిల్ 23న రిలీజ్ చేయడానికి మా ఫిల్మ్ రెడీగా ఉన్నప్పటికీ కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటం, తదనుగుణమైన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌ల కారణంగా ప్రభుత్వ నియమ నిబంధనలను గౌరవిస్తూ 'తలైవి' విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. రిలీజ్ డేట్‌లో తేడా వచ్చినప్పటికీ, మీ అందరి నుంచీ ఎప్పట్లాగే ప్రేమను అందుకుంటామని నమ్ముతున్నాం." అని ఆ లెటర్‌లో నిర్మాతలు రాసుకొచ్చారు. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటించనున్నారు.
ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి, జానకీ రామచంద్రన్‌గా మధుబాల, కరుణానిధిగా సముద్రకని నటించిన 'తలైవి' మూవీని ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేశాడు. కాగా ఇదివరకు పలు బిగ్ టిక్కెట్ బాలీవుడ్ సినిమాల విడుదలను వాయిదా వేయడంతో, వారిని హేళన చేస్తూ 'తలైవి' ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోందని కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పడం గమనించదగ్గ అంశం.