English | Telugu

క‌రోనాతో.. 'మ‌హాభార‌త్' న‌టుడు మృతి!

క‌రోనాతో.. 'మ‌హాభార‌త్' న‌టుడు మృతి!

 

ప్రముఖ సినీ, టీవీ న‌టుడు స‌తీశ్ కౌల్ శ‌నివారం లూధియానాలో మృతి చెందారు. 74 సంవ‌త్స‌రాల కౌల్ కొవిడ్‌-19తో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు. బి.ఆర్‌. చోప్రా రూపొందించ‌గా దూర‌ద‌ర్శ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన 'మ‌హాభార‌త్' సీరియ‌ల్‌లో ఇంద్రునిగా న‌టించి పాపుల‌ర్ అయ్యారు స‌తీశ్ కౌల్‌. హిందీ, పంజాబీ భాష‌ల్లో ఆయ‌న దాదాపు 300 సినిమాల దాకా న‌టించారు.

ఆరు రోజుల క్రితం జ్వ‌రం రావ‌డంతో చికిత్స కోసం ఆయ‌న‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించిన‌ట్లు ఆయ‌న సోద‌రి స‌త్యాదేవి తెలిపారు. "ఈరోజు ఉద‌యం హాస్పిట‌ల్‌లో కొవిడ్‌-19తో ఆయ‌న మర‌ణించారు. ఆయ‌న జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ కోలుకోలేక‌పోయారు. ఆయ‌న‌ను మేం గురువారం హాస్పిట‌ల్‌లో చేర్పించి టెస్ట్ చేయించ‌గా కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది." అని ఆమె వెల్ల‌డించారు.

ప‌లువురు అభిమానులు, సెల‌బ్రిటీలు ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో నివాళుల‌ర్పిస్తున్నారు. కౌల్ న‌టించిన సినిమాల్లో 'ప్యార్ తో హోనా హి థా', 'ఆంటీ నంబ‌ర్ 1' లాంటివి ఉన్నాయి. అలాగే పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్ 'విక్ర‌మ్ ఔర్ బేతాళ్‌'లోనూ ఆయ‌న న‌టించారు.