English | Telugu

అభిమానులకు ఉదిత్‌ నారాయణ్‌ లిప్‌లాక్‌లు.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

అభిమానులకు ఉదిత్‌ నారాయణ్‌ లిప్‌లాక్‌లు.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

ఉదిత్‌ నారాయణ్‌.. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న గాయకుడు. ఇటీవలికాలంలో సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వివిధ నగరాల్లో కచ్చేరీలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు అతనితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దాన్ని ఆసరా చేసుకొని తనతో సెల్ఫీలు దిగే అమ్మాయిల బుగ్గలపై ముద్దులు పెడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అయితే ఇటీవల అది కాస్త శ్రుతి మించి లిప్‌లాక్‌ల వరకు వెళ్లింది. సెల్ఫీల కోసం వచ్చే అమ్మాయిల బుగ్గలు ముద్దాడుతూ వారి పెదవులపై కూడా ముద్దులు కురిపిస్తున్నారు. దీంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు. 69 ఏళ్ళ ఉదిత్‌ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ఉదిత్‌.. ‘వాళ్ళు నా అభిమానులు. నాపై ప్రేమతో నాతో సెల్ఫీలు దిగేందుకు దగ్గరకు వస్తున్నారు. వారిపట్ల నాకున్న ప్రేమను ముద్దుల ద్వారా తెలియజేస్తున్నాను. ఇందులో తప్పేముంది? మైఖేల్‌ జాక్సన్‌ వంటి సింగర్స్‌ కూడా తన అభిమానుల్ని కిస్‌ చేసేవాడు. ఇది కూడా అంతే’ అంటూ సమర్థించుకుంటున్నాడు ఉదిత్‌. ఈ ముద్దుల తంతుపై అతను స్పందించిన తీరును కూడా తప్పుబడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆయా వీడియోలను వైరల్‌ చేస్తూ ఉదిత్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. 

పపంచవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులకు ఉదిత్‌ నారాయణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 45 సంవత్సరాలుగా తన పాటలతో అందర్నీ అలరిస్తున్న ఉదిత్‌ 36 భాషల్లో దాదాపు 25,000 పాటలు పాడారు. తెలుగులో కూడా లెక్కకు మించిన పాటలు పాడారు. ఆయన తెలుగులో పాడిన పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. 1970లోనే సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఉదిత్‌ టాలెంట్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు రాజేష్‌ రోషన్‌ మొదట గుర్తించారు. మిథున్‌ చక్రవర్తి హీరోగా నటించిన ‘ఉన్నీస్‌ బీస్‌’ అనే చిత్రంలో మొదటిసారి మహ్మద్‌ రఫీ, ఉషా మంగేష్కర్‌లతో కలిసి ‘మిల్‌ గయా మిల్‌గయా..’ అనే పాటను పాడారు. ఆ తర్వాత 20 సంవత్సరాలపాటు సింగర్‌గా చాలా బిజీ అయిపోయారు. 2020 వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. 69 సంవత్సరాల ఉదిత్‌ నారాయణ్‌ గత కొంతకాలంగా స్టేజ్‌ షోలు చేస్తూ తన గానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని షోలలో ఆయన ప్రవర్తన తీరుపై ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.