English | Telugu
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో విజయం సాధించిన ముంబై పోలీసులు!
Updated : Feb 7, 2025
గత నెలలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంటిలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టి, ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా పరిశోధన చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ కేసులో విజయం సాధించారు ముంబై పోలీసులు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాంను థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సేకరించిన వేలి ముద్రలు చాలా నమూనాలతో మ్యాచ్ అయినట్టు తెలుస్తోంది. షరీఫుల్ వేలిముద్రలను పరీక్ష నిమిత్తం పంపించారు. వాటిలో కొన్ని నివేదికలు వచ్చాయి. అందులో ఘటన జరిగిన ప్రదేశంలోని వేలిముద్రలతో అతని వేలిముద్రలు సరిపోయాయి. అయినప్పటికీ ల్యాబ్ నుంచి వచ్చే తుది నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. సైఫ్ అలీఖాన్ ఇంట్లో దోపిడీ చేసే ఉద్దేశంతో ఆ అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించిన షరీఫుల్.. సైఫ్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో పలుమార్లు సైఫ్‌ను కత్తితో గాయపరిచాడు షరీఫుల్. ఆ దాడికి ప్రయత్నించిన వ్యక్తి అతనేనని ఫ్లాట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు గుర్తించారు. అంతేకాదు, సిసి టీవీ ఫుటేజ్‌లోని ముఖంతో షరీఫుల్ ఫేస్ కూడా మ్యాచ్ అయిందని పోలీసులు తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ కూడా పాజిటివ్‌గానే వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు షరీఫుల్ బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చాడు. ముంబైకి రాక మునుపు కోల్‌కొతాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాడు. దాడి చేసిన తర్వాత బంగ్లాదేశ్ పారిపోవాలని ఆలోచిస్తున్నాడని పసిగట్టిన పోలీసులు థానేలోని హిరానందని ఎస్టేట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు జరిపిన పరీక్షలన్నీ నిందితుడు షరీఫుల్ అనేది నిర్ధారణ చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ కేసు ఫైనల్ స్టేజ్‌కి వచ్చే అవకాశం ఉంది.