English | Telugu
భర్త నుంచి విడిపోవడానికి సిద్ధమవుతున్న శిల్పాశెట్టి!
Updated : Sep 1, 2021
జూలై 19న శిల్పాశెట్టి భర్త, లండన్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో పబ్లిష్ చేస్తున్నాడనేది ఆయనపై ఉన్న అభియోగం. ఈ వ్యవహారంలో చాలా రోజుల పాటు శిల్పాశెట్టి మౌనం వహించడమే కాకుండా, ఇంటి నుంచి బయటకు రాలేదు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా దీనిపై స్పందిస్తూ వస్తోందామె.
కాగా, భర్త రాజ్ కుంద్రాతో విడిపోవడానికి శిల్ప రెడీ అవుతోందంటూ బాలీవుడ్‌లో లేటెస్ట్‌గా ప్రచారం జరుగుతోంది. పిల్లలు వియాన్, సమిషలను తనతో తీసుకుపోవడానికి ఆమె ప్రిపేర్ అవుతోందనీ, రాజ్ కుంద్రా ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉందనీ చెప్పుకుంటున్నారు.
అడల్ట్ సినిమాల నిర్మాణంలో భర్త ఇన్‌వాల్వ్‌మెంట్ అనేది శిల్పకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది. "నిజానికి తమ ఆస్తులు కానీ, భర్త తనకు ప్రెజెంట్ చేస్తున్న డైమండ్స్ కానీ ఎక్కడ్నుంచి వస్తున్నాయనేది ఆమెకు తెలీదు. అవి అక్రమ సంపాదన ద్వారా వస్తున్నాయనేది ఆమె జీర్ణించుకోలేని విషయం. రాజ్ కుంద్రా సమస్యలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. నిజానికి రోజు రోజుకీ అవి పెరుగుతున్నాయి." అని శిల్ప క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వెల్లడించారు.
తమ తండ్రి అక్రమ సంపాదనకు దూరంగా పిల్లలను తీసుకుపోవాలని శిల్ప ఆలోచిస్తున్నట్లు సమాచారం. భర్తకు దూరంగా వెళ్లిపోవాలనీ, అతడితో వేరుపడాలనీ ఆమె ప్లాన్ చేస్తోందంటున్నారు. కుంద్రా ఆస్తుల్లో ఒక్క పైసా కూడా తీసుకోకూడదని కూడా ఆమె నిర్ణయించుకుందంట. ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, తగినంత డబ్బును ఆమె సంపాదిస్తోంది. 'హంగామా 2', 'నికమ్మ' సినిమాల తర్వాత మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉందనే సమాచారాన్ని ఇండస్ట్రీ వ్యక్తులకు ఇప్పటికే ఆమె ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.