English | Telugu
అప్పుడు ప్రత్యూష.. ఇప్పుడు సిద్ధార్థ్.. విధి ఆడిన విషాద నాటకం!
Updated : Sep 2, 2021
నటుడు సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతిని బాలీవుడ్, హిందీ టీవీ రంగాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అనేకమంది అతడు చనిపోయిన వార్త నిజం కాదేమోనని పలుమార్లు చెక్ చేసుకొని, అది నిజమేనని తెలిశాక శోకతప్తులవుతున్నారు. సిద్ధార్థ్ సినీ నటుడిగా సూపర్‌స్టార్ కాకపోవచ్చు. కానీ బుల్లితెరకు సంబంధించి సూపర్‌స్టారే. సోషల్ మీడియాలో అతనికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే 40 ఏళ్ల అవివాహితుడైన సిద్ధార్థ్ గుండె పోటుతో మృతి చెందడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అతని మృతికి ఇంకేదైనా కారణం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.
రాత్రి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న సిద్ధార్థ్, ఉదయం పదిన్నర అయినా లేవకపోవడంతో చెల్లెలు లేపడానికి ప్రయత్నించింది. అయినా లేవకపోవడంతో, చూస్తే.. ఒళ్లు చల్లబడిపోయి ఉంది. వెంటనే కూపర్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమికంగా గుండెపోటుతో చనిపోయినట్లు వారు చెప్పారు. అయితే పోస్ట్‌మార్టమ్ ద్వారా అతని మృతికి అసలు కారణం ఏంటనేది వెల్లడి కావచ్చు.
కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉండగా సిద్ధార్థ్ మృతి చెందడంతో అతని అభిమానులు ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. ఆ సీరియల్‌లో హీరోయిన్ ఆనందిగా నటించిన ప్రత్యూష బెనర్జీ 24 ఏళ్ల వయసులో 2016 ఏప్రిల్ 1న ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరేసుకొని మృతి చెందగా, ఇప్పుడు హీరో శివరాజ్ శేఖర్‌గా నటించిన సిద్ధార్థ్ శుక్లా ఆకస్మికంగా మృతి చెందడం విధి రాసిన విషాద నాటకం అనుకోవాలి.
ఇంటీరియర్ డిజైనింగ్ చదివిన సిద్ధార్థ్ కొంతకాలం డిజైనర్‌గా రాణిస్తూనే, మోడలింగ్ చేశాడు. టీవీ రంగంలో అడుగుపెట్టి సీరియల్స్‌లో నటించాడు. ఫియర్ ఫ్యాక్టర్, ఝలక్ దిఖ్‌లా జా లాంటి రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సావధాన్ ఇండియా, ఇండియాస్ గాట్ టాలెంట్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. వరుణ్ ధావన్ మూవీ హంప్టీ శర్మా కీ దుల్హనియా మూవీలో కీలక పాత్ర చేశాడు. టాప్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి, 13వ సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు. ఆ టైమ్‌లో అతనికి వచ్చిన క్రేజ్ విపరీతం.
సిద్ధార్థ్‌కు తాగుడు వ్యసనం బాగా ఉందని తెలుస్తోంది. అతని తండ్రి కూడా తాగుబోతే. ఆయన లివర్ దెబ్బతిని చనిపోయాడు. సిద్ధార్థ్ పలువురు ఆడవాళ్లతో డేటింగ్ చేశాడు. మోస్ట్ ఫిట్ యాక్టర్‌గా అవార్డ్ గెలుచుకున్న సిద్ధార్థ్ హార్ట్ ఎటాక్‌తో చిన్నవయసులోనే చనిపోవడం అర్థంకాని విషయం. అతను 2019, 2020 సంవత్సరాలకు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆన్ టెలివిజన్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా నిలిచిన విషయం గమనించాలి. కలర్స్ టీవీ నిర్వహించిన బిగ్ బాస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్‌గా ఎన్నిక కాబడ్డాడు కూడా. అలాంటి మంచి నటుడ్ని, అందగాడ్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కోల్పోయింది.