English | Telugu
థియేటర్ ఓనర్లకు క్షమాపణలు చెప్పిన సల్మాన్!
Updated : May 11, 2021
సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్' ఈద్ (రంజాన్) సందర్భంగా మే 13న విడుదలవుతోంది. ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నందుకు సంతోషిస్తూనే థియేటర్ యజమానులకు క్షమాపణలు చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ దాదాపు జీరోగా ఉండబోతోంది కాబట్టి. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5కు చెందిన జీప్లెక్స్‌లో పే-పర్-వ్యూ పద్ధతిలో పినీ ప్రియులు ఈ సినిమాను చూడవచ్చని సల్మాన్ ప్రకటించాడు. కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా ఉండటంతో దేశంలోని అత్యధిక శాతం థియేటర్లు మూతపడ్డాయి. అందువల్ల అతి తక్కువ థియేటర్లలోనే ఈ మూవీ రిలీజవుతోంది.
సోమవారం జూమ్ ద్వారా కొద్దిమంది జర్నలిస్టులతో సల్మాన్ ఖాన్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు తను ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారమే 'రాధే' మూవీని మే 13న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. "జీ సపోర్ట్ లేకపోతే ఫ్యాన్స్‌కు నేనిచ్చిన ఈద్ కమిట్‌మెంట్‌ను నిలబెట్టుకొనేవాడిని కాదు. మహమ్మారితో జనం ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం చాలా ముఖ్యం. చాలామంది ఆదాయం తగ్గిపోయింది. థియేటర్లలో టిక్కెట్లకు ఎక్కువ డబ్బులు పెట్టే పరిస్థితి లేకుండా ఇంట్లోనే చాలా తక్కువ ధరకు కుటుంబమంతా ఈ సినిమాని చూడొచ్చు. ఈ క్లిష్ట కాలంలో ప్రజలకు కొంత వినోదాన్ని అందించాలని నేను కోరుకుంటున్నా." అని ఆయన చెప్పాడు.
"ఈ సినిమా విడుదలతో ప్రాఫిట్స్ సాధించవచ్చని సినిమా ఓనర్లు ఆశపెట్టుకున్నారు. వారికి నేను క్షమాపణలు తెలుపుకుంటున్నా. మహమ్మారి త్వరగా అంతమైపోతే దేశవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయవచ్చని మేం ఆశించాం. కానీ అలా జరగలేదు. తిరిగి సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయో మనకు తెలీదు. 'రాధే' బాక్సాఫీస్ కలెక్షన్ జీరోగా ఉండబోతోంది. సల్మాన్ ఖాన్ సినిమాకి సంబంధించి ఇంత అత్యల్ప కలెక్షన్ ఉండబోవడం ఇదే. దేశంలో ఇది అతి తక్కువ థియేటర్లలో విడుదలవుతోంది. అలాగే ఓవర్సీస్‌లోనూ మామూలుగా కంటే తక్కువ థియేటర్లలోనే రిలీజవుతోంది. కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ వెరీ పూర్‌గా ఉండబోతోంది." అని చెప్పుకొచ్చాడు సల్మాన్.
కొరియన్ ఫిల్మ్ 'ది ఔట్‌లాస్'కు రీమేక్‌గా 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'ను రూపొందించాడు ప్రభుదేవా. సల్మాన్ జోడీగా దిశా పటాని నటించగా, కీలక పాత్రల్లో జాకీ ష్రాఫ్, రణదీప్ హూడా కనిపించనున్నారు. ఒక పెద్ద డ్రగ్ మాఫియాను నాశనం చేయడానికి రంగంలోకి దిగే అండర్‌కవర్ కాప్‌గా సల్మాన్ నటించాడు.