English | Telugu

భయం గుప్పిట్లో సినీ ప్రముఖులు.. పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్!

భయం గుప్పిట్లో సినీ ప్రముఖులు.. పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్!

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్‌కి బెదిరింపుల బెడద చాలా ఎక్కువ. ఒకప్పుడు బాలీవుడ్‌.. మాఫియా కనుసన్నలలో నడిచేది. ఆ ముఠా ఎలా చెబితే అలా హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు నడుచుకునే పరిస్థితి ఉండేది. ఆ తర్వాతికాలంలో ఆ తరహా బెదిరింపులు బాగా తగ్గాయి. తాజాగా కొందరు బాలీవుడ్‌ ప్రముఖులకు బెదిరింపు కాల్స్‌, ఈమెయిల్స్‌ వచ్చాయని తెలుస్తోంది. వారిలో కపిల్‌ శర్మ, రాజ్‌పాల్‌ యాదవ్‌, సుగంధ మిశ్రా, రెమో డిసౌజా ఉన్నారు. దీంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. తమకు వచ్చిన బెదిరింపు కాల్స్‌, ఈమెయిల్స్‌ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సెలబ్రిటీలు. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ను కొన్నేళ్లుగా మృత్యువు వెంటాడుతున్న విషయం తెలిసిందే. కృష్ణజింక కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా పలుమార్లు సల్మాన్‌పై ఎటాక్‌ చేసేందుకు ప్రయత్నించింది. అంతేకాదు, సల్మాన్‌ కుటుంబ సభ్యులను కూడా వారు బెదిరించారు. సల్మాన్‌ ఖాన్‌ ఎన్నో ఏళ్ళుగా పర్సనల్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని తన పనిచేసుకుంటున్నాడు. తాజాగా సైఫ్‌ అలీఖాన్‌పై ఒక యువకుడు కత్తితో దాడిచేసి గాయపరిచిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరికొందరు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కాల్స్‌ పాకిస్తాన్‌ కేంద్రంగా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్‌ ప్రముఖులు పోలీసులను ఆశ్రయించారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి కాల్స్‌ వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తాము చేసిన కాల్స్‌కి, ఈమెయిల్స్‌కి 8 గంటల్లో సమాధానం ఇవ్వకపోతే చంపేస్తామని ఆ గ్యాంగ్‌ చెప్పినట్టు తెలుస్తోంది. 

తాజా పరిణామాలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు బాలీవుడ్‌ ప్రముఖులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్‌ ముఠా టార్గెట్‌గా ఉన్న ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కాల్స్‌ ఎవరు చేస్తున్నారు, మెయిల్స్‌ ఎవరు పంపిస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని ఛేదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు బాలీవుడ్‌ భయం గుప్పిట్లో ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్‌ అందరిలోనూ కనిపిస్తోంది.