English | Telugu
లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కన్నుమూత
Updated : Jul 6, 2021
దేశంలోని గ్రేటెస్ట్ యాక్టర్స్‌లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన దిలీప్ కుమార్ బుధవారం (జూలై 7) ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన, పలుమార్లు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేరుతూ వచ్చారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. జూన్ 30న ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఆయనను చేర్పించారు. చికిత్స జరిగినంత కాలం దిలీప్ భార్య సైరా బాను ఆయన వెంటే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
అంతకుముందు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎప్పటికప్పుడు సైరా బాను అప్‌డేట్ ఇస్తూ వచ్చారు. చివరగా ఆమె, "దిలీప్ కుమార్ సాబ్ ఆరోగ్యం ఇప్పటికీ నిలకడగానే ఉంది. ఆయన ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు, మేం ఆయనను ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాం. డాక్టర్ల అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన ఆరోగ్యస్థితి ఏమిటనేది వాళ్లకు తెలుసు కాబట్టి, వాళ్లు అనుమతించగానే ఇంటికి తీసుకువెళ్తాం. ఈరోజు ఆయన డిశ్చార్జ్ కావట్లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా అభిమానుల్ని కోరుతున్నాను." అని ట్వీట్ చేశారు.
అదివరకు కూడా శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు ఎదురవడంతో జూన్ 6న తొలిసారి దిలీప్ కుమార్ హాస్పిటల్‌లో చేరారు. ఆయన ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని కనుగొన్న డాక్టర్లు ప్లూరల్ యాస్పిరేషన్ ప్రొసీజర్ ద్వారా దాన్ని తొలగించారు. ఐదు రోజుల తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆ తర్వాత కూడా ఆయన శ్వాసక్రియ సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు.
'ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్'గా పేరుపొందిన దిలీప్ కుమార్ ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మరపురాని చిత్రాల్లో భిన్న తరహా పాత్రలను పోషించి, కోట్లాది ప్రేక్షకులను రంజింపజేశారు. ఆయన అసలు పేరు ముహమ్మద్ యూసఫ్ ఖాన్. ఆయన నటనకు దేవదాస్ (1955), నయా దౌర్ (1957), ముఘల్-ఎ-ఆజమ్ (1960), గంగ జమున (1961), క్రాంతి (1981), కర్మ (1986) సినిమాలు గీటురాళ్లుగా నిలిచాయి. చివరగా ఆయన 'ఖిలా' (1998) చిత్రంలో నటించారు.