English | Telugu
సంజయ్‌దత్ తల్లిదండ్రులు నర్గీస్-సునీల్‌దత్ అందమైన ప్రేమకథ!
Updated : Jul 6, 2021
సునీల్‌దత్ విషయానికి వస్తే నర్గీస్‌ను ఒక సినిమా ప్రీమియర్‌లో తొలిసారి చూడగానే ప్రేమలో పడిపోయాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్! అప్పటికే నర్గీస్ టాప్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో రాణిస్తున్నారు. సునీల్ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పోరాటం చేస్తున్నారు. అలాంటి ఆ ఇద్దరి మధ్యా ప్రేమకథ 'మదర్ ఇండియా' సెట్స్ మీద ప్రారంభమైంది.
దేశానికి పేరు తెచ్చిన సినిమాల్లో 'మదర్ ఇండియా' ఒకటి. అందులో నర్గీస్ పర్ఫార్మెన్స్‌ను ఇండియాస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్‌లో ఒకటిగా విమర్శకులు పేర్కొంటూ ఉంటారు. అదే సినిమాలో సునీల్ నటన కూడా అత్యుత్తమ స్థాయిలో రాణించింది. రాజ్ కపూర్‌తో అనుబంధం విషయంలో ఎదురుదెబ్బలు తిన్న నర్గీస్.. అందులో నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలమది. మరోవైపు నర్గీస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి సునీల్ ప్రయత్నిస్తున్నారు. అప్పుడే 'మదర్ ఇండియా' సెట్స్ మీద అగ్నిప్రమాదం సంభవించి, నర్గీస్ మంటల్లో చిక్కుకున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి నర్గీస్‌ను కాపాడారు సునీల్. ఆ క్రమంలో తను గాయపడ్డారు కూడా.
స్వతహాగానే నర్గీస్ దయార్ద్ర హృదయురాలు. ఆ ఘటన తర్వాత సునీల్ ఆమెకు మంచి స్నేహితుడయ్యారు. ఒకసారి సునీల్ సోదరికి సర్జరీ అవసరమైతే ఆమెను నర్గీస్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి, ఆ సర్జరీ పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నారు. ఇది సునీల్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకరోజు నర్గీస్‌ను ఆమె ఇంటివద్ద డ్రాప్ చేయడానికి వెళ్లిన సునీల్, ఆమెకు ప్రపోజ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆమె కాదంటే, సినిమాలను వదిలేసి, తన స్వగ్రామానికి వెళ్లిపోవాలనుకున్నారు. అయితే సునీల్ సోదరి సమక్షంలోనే ఆయనకు ఓకే చెప్పారు నర్గీస్. కొద్ది రోజులు ప్రేమపక్షుల్లాగా విహరించాక, 1958లో వారు దంపతులుగా మారారు.
23 ఏళ్లపాటు వారి దాంపత్య జీవనం ఎంతో అందంగా, ఆనందంగా కొనసాగింది. వారి అనురాగానికి ప్రతిరూపాలుగా సంజయ్,నమ్రత, ప్రియ పుట్టారు. కానీ విధి వైచిత్రి. పేన్‌క్రియాటిక్ కేన్సర్‌కు గురైన నర్గీస్ కేవలం 52 ఏళ్ల వయసులో 1981లో తన వెండితెర హీరో మాత్రమే కాకుండా నిజ జీవిత హీరో కూడా అయిన సునీల్‌దత్‌ను విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సునీల్ కూడా లేరు. 2005లో ఆయనా కన్నుమూశారు.