English | Telugu

రూ. 11 కోట్ల ల‌క్ష్యాన్ని దాటేసిన విరుష్క‌!

 

కొవిడ్‌-19 రిలీఫ్ కోసం #InThisTogether పేరుతో ప్ర‌చారం ప్రారంభించిన అనుష్క శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ దంప‌తులు రూ. 11 కోట్ల‌కు పైగా విరాళాలు సేక‌రించారు. మొద‌ట రూ. 7 కోట్ల ల‌క్ష్యంతో అడుగు ముందుకేసిన ఆ జంట‌, ఆ త‌ర్వాత త‌మ ల‌క్ష్యాన్ని రూ. 11 కోట్ల‌కు పెంచిన‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ ల‌క్ష్యాన్ని కూడా వారు అధిగ‌మించేశారు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా అనుష్క వెల్ల‌డించింది. కొవిడ్ రిలీఫ్ కోసం ఇచ్చిన విరాళాల పిలుపుకు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న త‌మ‌ను ఎంతో ఆనంద‌ప‌ర‌చింద‌ని ఆమె తెలిపింది.

"మీరు చూపించిన దాతృత్వానికి నిజంగా ఎంత‌గానో ఆనందించాం. మా టార్గెట్‌ను మించి విరాళాలు సేక‌రించామ‌ని అనౌన్స్ చేయ‌డానికి గ‌ర్విస్తున్నాం. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ్డానికి మ‌రింత దూరం వెళ్ల‌నున్నాం. భార‌తీయుల‌కు సాయం చేయ‌డానికి మీరు అందిస్తున్న స‌పోర్ట్‌కు ధ‌న్య‌వాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యం కాదు. జై హింద్." అని ఆమె రాసుకొచ్చింది. ఇంత‌దాకా రూ. 11,39,11,820 విరాళాలుగా అందాయ‌ని ఆమె ప్ర‌క‌టించింది.

త‌మ వంతుగా విరుష్క జోడీ రూ. 2 కోట్ల విరాళం అందించింది. మే 7న త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభించేట‌ప్పుడు రూ. 7 కోట్ల విరాళాల‌ను టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్లు చెప్పిన ఆ జంట‌, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న అనూహ్య స్పంద‌న‌తో మే 12న తమ టార్గెట్‌ను రూ. 11 కోట్ల‌కు పెంచింది. ఒక్క ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేష‌న్ నుంచే వారికి రూ. 5 కోట్ల విరాళం అందింది.