English | Telugu
సల్మాన్ 'రాధే' దెబ్బకు సర్వర్లు సైతం క్రాష్!
Updated : May 15, 2021
సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్' ఇండియాలో పే-పర్-వ్యూ పద్ధతిలో జీ5కు చెందిన జీప్లెక్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు పేరుపొందిన డీటీహెచ్ సర్వీసుల్లోనూ, ఇంటర్నేషనల్‌గా థియేటర్లలోనూ విడుదలై, ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ అందుకొని తొలిరోజు మోస్ట్ వాచ్డ్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. ఓటీటీలో విడుదలైన క్షణం నుంచీ ఫ్యాన్స్ ఆ సినిమా చూడ్డానికి విపరీతమైన ఆసక్తి కనపర్చడంతో ఒకానొక సమయంలో సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయంటే, ఏ రీతిలో 'రాధే'కు ఆదరణ లభించిందో ఊహించుకోవాల్సిందే. ఓవర్సీస్‌లోనూ చాలావరకు థియేటర్లు ఫుల్ అయ్యాయి. దాంతో ఈద్ బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు దేశంలోని థియేటర్లన్నీ మూతపడి ఉన్నాయ్. కొవిడ్-19 పాజిటివ్ కేసులు ఊహాతీతంగా పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ లాంటి దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న సూపర్‌స్టార్ నటించిన సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్‌పామ్‌పై నేరుగా రిలీజ్ చేయడం రిస్క్‌తో కూడిన సరికొత్త అనుభవం. అయితే ఆ రిస్కును 'రాధే' సక్సెస్‌ఫుల్‌గా అధిగమించింది. మహమ్మారి ప్రభావంలో ఉన్న దేశంలోని అన్ని భాషా చిత్రసీమలకు 'రాధే' ఓ భరోసా ఇచ్చిందని చెప్పాలి.
ఇదివరకు సూర్య సినిమా 'సూరారై పొట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా') సినిమా సైతం ఇదే విధంగా విడుదలై, మన దేశంలో ఓటీటీలో అప్పటివరకూ విడుదలైన సినిమాల్లో అత్యధికులు వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టిస్తే, ఇప్పుడు 'రాధే' సినిమా తొలి రోజే రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త బిజినెస్ మోడల్‌గా నిలిచింది. తొలిరోజు ఈ సినిమాకు డిజిటల్ పరంగా 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయని జీ స్టూడియోస్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా అది రిలీజ్ చేసింది.
సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ 'ది ఔట్‌లాస్' ఆధారంగా ప్రభుదేవా తెరకెక్కించిన 'రాధే' మూవీలో సల్మాన్ జోడీగా దిశా పటాని నటించగా, జాకీ ష్రాఫ్, రణదీప్ హూడా కీలక పాత్రలు పోషించారు.