English | Telugu
అమెరికాలో అమితాబ్ లైఫ్‌టైమ్ విగ్రహం.. పర్యాటక ఆకర్షణగా గుర్తించిన గూగుల్!
Updated : Jul 29, 2024
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ అమితాబ్ ఛరిష్మా అనేది ఏమాత్రం తగ్గలేదు. దానికి ఉదాహరణగా అమెరికాలో ఉన్న ఓ అభిమాని చేసిన పని గురించి చెప్పాలి. న్యూజెర్సీలోని వ్యాపారవేత్త గోపీసేథ్‌కు అమితాబ్ అంటే విపరీతమైన అభిమానం. తన అభిమానాన్ని చాటుకునేందుకు అతను ఓ పనిచేశాడు. తన ఇంటి ముందు అమితాబ్ లైఫ్‌టైమ్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమం 2022 ఆగస్ట్‌లో జరిగింది. ఈ విగ్రహావిష్కరణకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది అభిమానులు హాజరయ్యారు. ఒక గాజు బాక్స్‌లో అమితాబ్ కూర్చొని ఉన్న విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా అక్కడ అమితాబ్ కూర్చొని ఉన్నారా అనేంతగా ఆ విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది.
గత రెండు సంవత్సరాలుగా ఎంతో మంది పర్యాటకులు ఆ విగ్రహాన్ని సందర్శించేందుకు అక్కడికి వెళుతున్నారు. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫోటోలు తీయించుకుంటున్నారు. అమితాబ్ విగ్రహానికి పెరిగిన ఆదరణ కారణంగా గూగుల్ దాన్ని పర్యాటక ఆకర్షణ జాబితాలో చేర్చింది. అమితాబ్ విగ్రహం వల్ల తమ ఇల్లు పర్యాటక కేంద్రంగా మారిందని గోపీసేథ్ ఎంతో ఆనందంగా చెబుతున్నాడు. గూగుల్ సెర్చ్ ద్వారా ప్రతిరోజూ ఎంతో మంది సందర్శకులు అక్కడికి వెళుతున్నారట. తమ ఇల్లు అమితాబ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలియజేస్తోందంటున్నాడు. ఇక్కడికి వచ్చిన వారు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం వల్ల పర్యాటకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందట. ఆ విగ్రహాన్ని సందర్శించడానికి వెళ్ళిన పర్యాటకులు ఆ ఫోటోలతో ఇన్‌స్టా, యూట్యూబ్‌లను నింపేస్తున్నారని ఎంతో సంతోషంగా చెబుతున్నాడు గోపీసేథ్.