English | Telugu
హిందీలో నాలుగో ‘వర్షం’.. డైరెక్టర్ తెలుగువాడే!
Updated : Jul 30, 2024
ప్రభాస్, త్రిష జంటగా శోభన్ దర్శకత్వంలో యం.యస్.రాజు నిర్మించిన ‘వర్షం’ చిత్రం తెలుగులో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తన కెరీర్‌లో మూడో సినిమాగా రూపొందిన ‘వర్షం’తో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్‌కి వెళ్లిపోయాడు. వీరు పోట్ల కథ, పరుచూరి బ్రదర్స్ మాటలు, శోభన్ టేకింగ్ సినిమాకి పెద్ద ఎస్సెట్స్‌గా నిలిచాయి. ఈ సినిమాను హిందీలో ‘బాఘి’ పేరుతో రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధీర్‌బాబు విలన్‌గా నటించాడు. అతనికి ఇదే తొలి హిందీ సినిమా. తెలుగులో గోపీచంద్ చేసిన పాత్రను హిందీలో సుధీర్ చేశాడు. రూ.35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి రూ.129 కోట్లు కలెక్ట్ చేసింది.
దీంతో బాఘి సిరీస్ మొదలైంది. మొదటి భాగానికి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, 2, 3 భాగాలను అహ్మద్‌ఖాన్ డైరెక్ట్ చేశాడు. రెండో భాగాన్ని ‘క్షణం’ చిత్రం ఆధారంగా రూపొందించారు. ‘క్షణం’ చిత్రానికి అడివి శేష్ కథ అందించిన విషయం తెలిసిందే. మూడో భాగాన్ని లింగుస్వామి దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘వేట్టేౖ’ ఆధారంగా తెరకెక్కించారు. ‘బాఘి3’ విడుదలై 4 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో భాగంగా ‘బాఘి4’ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి మూడు సినిమాలను నాడియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పతాకాలపై సాజిద్ నాడియాద్‌వాలా నిర్మించారు. టైగర్ ష్రాఫ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. బాఘి మూడు భాగాల్లో తను చేసిన థ్రిల్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూడు సినిమాలూ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు నాలుగో భాగంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు మేకర్స్.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘బాఘి4’ను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి 3 సినిమాలను బాలీవుడ్ డైరెక్టర్స్ రూపొందించారు. అయితే నాలుగో భాగాన్ని తెరకెక్కించే బాధ్యతను ఓ టాలీవుడ్ డైరెక్టర్‌కి అప్పగించాలన్న ఆలోచనలో నిర్మాత నాడియాద్‌వాలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం నాడియాద్‌వాలా లిస్ట్‌లో ‘సికిందర్’, ‘హౌస్‌ఫుల్5’ చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ‘బాఘి4’పై దృష్టి పెడతారట. ఈమధ్యకాలంలో సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్‌లో తమ సత్తా చూపిస్తున్న విషయం తెలిసిందే. అందుకే సౌత్ డైరెక్టర్లపై బాలీవుడ్ నిర్మాతలకు మంచి గురి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు బాఘి సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ సౌత్ సినిమాలకు రీమేక్స్ కావడం విశేషం. అందుకే ఈసారి ‘బాఘి4’కి టాలీవుడ్ డైరెక్టర్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం టాలీవుడ్‌లో ఎవరికి వస్తుందో చూడాలి.