English | Telugu
బడ్జెట్ 25 కోట్లు.. కలెక్షన్ 342 కోట్లు. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రాబోతోంది!
Updated : Jul 29, 2024
మరో సంవత్సరంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారని అప్పటికి ఎవరికీ తెలీదు. అసలు కోవిడ్ అనేది ఒకటి ఉందని కూడా తెలీదు. ఆ సమయంలో 2019, జనవరి 11న ఓ హిందీ సినిమా రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. రూ.25 కోట్లతో రూపొందిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.342 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ సినిమా పేరు ‘ఉరీ(ది సర్జికల్ స్ట్రైక్). విక్కీ కౌశల్, యామి గౌతమ్, పరేష్ రావల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా ఈ చిత్రానికి నిర్మాత. 2019లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి మంచి వసూళ్లు సాధించాయి. అయితే వాటిలో 2019లో విడుదలైన ‘వార్’ తర్వాత అంతటి కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘ఉరీ’ రికార్డు సృష్టించింది. 2019 వరకు భారతదేశంలో నిర్మించిన సినిమాల్లో అంత భారీ కలెక్షన్ సాధించిన 10వ సినిమాగా చరిత్రకెక్కింది. అంతేకాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ అందుకున్న సినిమాగా కూడా నిలిచింది.
ఇండియా మీద పాక్ బలగాలు చేసిన కాల్పులకు ఇండియన్ సోల్జర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, సర్జికల్ స్ట్రైక్‌తో పాక్ బలగాలను ఎలా మట్టు పెట్టారు అనేది కథాంశం. ఇండియన్ సోల్జర్స్‌లో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకుండా ఇండియాకి ఎలా తిరిగి వచ్చారు.. అసలు ఇది ఎలా జరిగిందీ అనేది రియల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రేక్షకులు ఈ సినిమాని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. దానికితోడు అప్పట్లో జరిగిన పుల్వామా అటాక్ వల్ల సినిమాకి లాంగ్ రన్ దక్కింది. అలాగే ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ‘పుల్వామా అటాక్’ పేరుతో సీక్వెల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.